యోగ దర్శనం – Yoga Darshanam

ప్రకృతి పురుష వివేకజ్ఞానము . చిత్తము సమాహితం కావలెను . చిత్త సమాధానము , ఏకాగ్రత , నిశ్చలత లను సాధించడానికి యోగము కావలెను .
సూ ! అథ యోగానుశాసనమ్
యోగం అంటే సమాధి స్థితి సాధించడానికి అవసరమైన శాసనం చెయ్యబడింది . చిత్తము యొక్క సార్వభౌమిక రూపమే సమాధి.
యోగమంటే ఏమిటి ?
సూ! యోగ చిత్తవృత్తి నిరోధః
మనస్సు , బుద్ధి , అంతఃకరణముల సంగమమే చిత్తం అనబడును .
చిత్తము వస్తువుల యొక్క ఆకారమును పొందుట వృత్తి అనబడును .
శాంతము , మూఢము , ఘోరం అని చిత్తవృత్తులు మూడు రకములు .
అభ్యాసము , వైరాగ్యము లేక విరక్తి లేక విముఖత ద్వారా చిత్తమును వృత్తి రూపముగా మారకుండా చెయ్యడమే యోగం .
అభ్యాస వైరాగ్యముల ద్వారా మిగతా ఆలోచలన్నీ క్షీణించి చిత్తము తన తత్వముపై, తరువాత తనపై తదేక ధ్యాస కలిగి ఉండును. ఇదే ధ్యానం .
ఎల్లవేళలా ధ్యానమొక్కటే మిగిలితే దానిని శుద్దసాత్విక పరిణామము లేక సంప్రజ్ఞాత సమాధి అంటారు .
ఇక్కడ ధ్యేయ వస్తువు ఉన్నది ఉన్నట్లుగా తెలియబడును
సాత్విక వృత్తి ధ్యేయాకారముగా ఉండుట వలన శాంతము ద్వారా రాజస , తామస వృత్తుల బాహ్య ప్రవృత్తులైన మూఢం , ఘోరం నిరోధించబడతాయి .
ఏకతత్వమే ఆలంబనగా ఉండే సంప్రజ్ఞాతమును ఏకాగ్రత అనీ , అది సమాహితమైతే అది సమాధి అనీ అంటారు .
ఏకాగ్రత అంటే ఒకే దానిపై ధ్యాస లేక ధ్యానం . సమాహితము లేక సమాధి అంటే ధ్యేయం పై ధ్యానం అంటే చిత్తము యొక్క మూలముపై ధ్యానం చెయ్యడం .
చిత్తం తనలోపల తానుండటం
ఏకాగ్రత కుదిరి, బాహ్య దృష్టిని మరలించి తన తత్వంపై దృష్టిని నిలిపి తదేకంగా ఉంటేనే చిత్తం సమాహితమవుతుంది . సమాహితమైన చిట్టా స్థితినే సమాధి అంటారు .
సమాధిలో చిత్తము ఏకాగ్రమై పరమార్థ తత్వాన్ని తెలియచేసి , అవిద్యను క్షీణింపచేసి , కర్మబంధమును శిథిలము చేసి , వృత్తిహీనతకు అభిముఖముగా చేయును .
సంప్రజ్ఞాతను ధ్యేయాకార చిత్తస్థితి అంటారు . దీనిని కూడా నిరోధిస్తే వేయించిన విత్తనము వాలే కార్యకారి కాక వాసనారహితమై సంస్కార మాత్రముగా వుండు చిత్తస్థితినే అసంప్రజ్ఞాత సమాధి అనబడును .
వృత్తి నిరోధములతో ఈ రెండు సమాధులను క్రమముగా సాధించడమే యోగం .
యోగం కాక మిగిలిన అవస్థలు క్షిప్తము , మూఢము , విక్షిప్తం అని మూడు రకములు .
మూఢము – తమోగుణముఅధికమై నిద్రావృత్తులతో జడట వహించిన చిత్తమును మూఢము అంటారు
క్షిప్తము – రజోగుణం అధికమై బాహ్యవృత్తులతో ప్రేరేపించబడి చంచలమైన మనస్సుతో ఉండే చిత్తాన్ని క్షిప్తము అంటారు
విక్షిప్తావస్థ – సత్వ గుణము అధికమై జీవి మూల తత్వమునందు , ధ్యేయ వస్తువునందు అప్పుడప్పుడు ధ్యానం నిలిచి క్షిప్తావస్థలో ఎక్కువ సమయము గడిపే చిత్తాన్ని విక్షిప్తావస్థ అంటారు .
చిత్తము త్రిగుణాత్మకము . ప్రకాశ స్వభావాన్ని సత్వగుణమనీ , ప్రవృత్తి స్వభావాన్ని రజోగుణమనీ , స్తితిశీలాన్ని తమోగుణమనీ అంటారు
సత్వగుణమంటే జ్ఞానము , శాంతము , ప్రేమ మొదలైనవి . ప్రవృత్తి అంటే ఇచ్ఛ , క్రియ, పరితాపము , శోకము మొదలగు రజోగుణములు . నిలకడ , గురుత్వము , దీనత మొదలైనవి తమోగుణాలు .
ఈ మూడు గుణాలు ప్రతివ్యక్తిలోను వారి వ్యక్తిగత పరిణత ఆధారంగా వివిధ స్థాయిలలో ఉంటాయి .
చిత్తము ప్రవృత్తి కలదైనప్పుడు జీవాత్మ ప్రకృతితో మమేకమై ఉంటుంది .
వృత్తులు నిరోధించబడిన చిత్తము లేక జీవాత్మ తనలో తాను తన మూలమైన, సకల జీవ నిర్జీవులకు మూలము , శక్తి పదార్థాల సంగమ రూపము ఐన ఆది స్థితిలో జాగృతంగా ఉంటుంది .
స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్లు ప్రకృతి కొన్ని మూలసూత్రాల ఆధారంగానే మార్పులు చెంది ఈ సృష్టికి కారణమైంది . కానీ మనిషి పరిణామంలో జాగృతి వివిధ స్థాయిలను దాటి స్థితి చైతన్యాల పూర్ణ జ్ఞానంతో జాగృతి కలిగిన , సృష్టి తత్వాన్ని తన అధీనంలో ఉంచుకోగలిగి , అష్ట ఐశ్వర్యాలను సాధించగల భగవత్స్వరూపమై వెలుగుతోంది .
మానవుడే సాధనతో భగవంతుడవుతాడు . యద్భావం తద్భవతి అన్నట్లు తన దృష్టిని బట్టి మానవుడు తమోగుణాధికమైన పశువుగాను , రజోగుణాధికమైన మనిషిగానూ , సత్వ గుణాధికమైన దైవంగాను రూపొందుతాడు . అటువంటి ఉన్నతమైన మనుషులను గానీ , ఆత్మలను గానీ, గుణాలను తత్వాలను మనం దైవంగా చూస్తాము .
యోగం సిద్ధించిన తర్వాత జీవుడు –
సూ ! తద ద్రష్టు స్వరూపావస్థానం
యోగం ద్వారా చిత్త వృత్తిని నిరోధించినప్పుడు ద్రష్టగా ఉన్న జీవుడు తన మూల స్వరూపమైన పరమాత్మలో ( జాగృతి కలిగి, సృష్టి స్థితి లయ కారకుడై ) తానుంటాడు .
స్ఫటికము రంగులున్న పువ్వులుంటే ఆ రంగులను చూపిస్తుంది . ఆ పువ్వులను తీసెయ్యగానే రంగులు లేని స్పష్టమైన రూపంలో ఉంటుంది . అదే విధంగా చిత్త వృత్తులు లేని జీవుడు తనలో తానుండటాన్ని కైవల్యము అంటారు .
జాగృతితో తన మూలమైన పరమాత్మ స్వరూపంలో శాశ్వతంగా ఉండటమే సర్వ జీవ నిర్జీవ పరిణామ గతి లక్ష్యము . ముందు వెనుకలుగా వారి సాధన పరిణామ గతి వేగాన్ని బట్టి జీవులు ఆ శాశ్వత స్థితిని పొంది దైవంగా శాసిస్తాయి .
క్రమశిక్షణ , ఆచారము , అభ్యాసము , జ్ఞానము , ధర్మ పాలన , పూజలు – మానవాతీత శక్తుల ఆరాధన , యోగము అన్నీ ఈ శాశ్వత తత్వాన్ని చేరడానికి .
నిరంతరం ఆ ప్రయాణంలో మనిషికి అనేక చిత్త , దైవిక శక్తులు కలిగి మనుషులలో ఆదర్శ పురుషుడుగా , స్త్రీ గా పరిణామం చెంది ఆరాధనా స్థాయి కలిగిన వ్యక్తులుగా తమ జీవితంలోనూ , ఆ తరువాత గానీ పూజింపబడతారు . వారి పూజల ద్వారా కొన్ని ఫలితాలు కలిగి నమ్మకాలు పెరిగి సాధన తీవ్రతరమౌతుంది . సాధన ముఖ్య లక్షణం తాత్కాలిక ఉపశమన ఫలితాలపై కాకుండా తమ దైవ స్వరూపంగా మారడమే లక్ష్యం . ఈ రకమైన సాధన చెయ్యడానికి తమకు ఇష్టమైన , తమకంటే ఉన్నతమైన ఏ జీవ , దైవిక ప్రక్రుతి శక్తులనైనా ఆరాధించవచ్చు .
ఫలితాలే ప్రాతిపదికగా చేసే పూజలు , ప్ర్రార్ధనలూ అవి ఫలించకపోతే లేక శాశ్వత తత్వం పై అవగాహన లక్ష్యం లేకపోతె అవి పూజలైనా , యోగమైన మూఢభక్తిగానే పరిణతి చెందుతుంది . లేక గుడ్డి గానో , గుడ్డిలో మెల్లగానో లేక అసమ లేక అసంపూర్ణ దృష్టిగానో ఉంటుంది తప్ప సంపూర్ణ దృష్టిగా ఉండదు . సంపూర్ణ ద్రుష్టి సంపూర్ణ జ్ఞానాన్ని స్థాయిని , లక్ష్యాన్ని చేరుస్తుంది .
యోగం ద్వారా అలాంటి చిత్తస్థితిని చేరనప్పుడు చిత్తము ఇతర ప్రకృతి లేక శరీర విషయాలపై ద్రుష్టి కలిగి , వాటితో మేకం చెంది ఊర్ధ్వ ప్రయాణం నుండి అధో ప్రయాణానికి మరలుతుంది . అప్పుడు జీవుడు చిత్తవృత్తులతో సారూప్యం పొంది తన ఊర్ధ్వ అవస్థలను క్రమేణా కోల్పోతాడు .
సూ ! వృత్తి సారూప్యమితరత్ర
చిత్తము ఇతరమైన జీవ వృత్తులతో మమేకమై సారూప్యం చెందుతుంది లేక ఆలా మారుతుంది . శాశ్వత ఆధ్యాత్మిక లక్షణం నుండి తాత్కాలిక ఆది దైవిక ఇంకా క్షీణించి ఆది భౌతిక లక్షణాలతో లక్ష్యాలను నిర్దేశించుకొని చేరుకొంటుంది .
జీవుడు తన మూల స్థితి చైతన్యాలలో జాగృతి కలిగి శాశ్వతంగా ఉండటమే ముక్తి . ఆ స్థాయిలో జాగృతి క్షీణిస్తే కలిగే సంఘర్షణే జనన మరణ పరిభ్రమణం . జీవుడు తన ముఖాన్ని మాలిన దర్పణంలో చూసుకొంటే మలినంగానే ఉంటుంది .
ముక్తస్థాయి జాగృతి కలిగి ఉంటె పరిణామం ఉండదు .
చిత్త వృత్తులు యేవో తెలియనప్పుడు వాటిని నిరోధించ వీలు కాదు .
నిరోధించాల్సిన చిత్తవృత్తులు ఏవి ?
సూ ! వృత్తయ పంచతయ్య క్లిష్ట అక్లిష్టా
క్లిష్టములు అక్లిష్టములనీ వృత్తులు ఐదు . ధర్మాధర్మ సంస్కారములకు ఉత్పత్తి స్థానములైన రాజస తామస వృత్తులు క్లిష్టములు . కష్టము కలిగించు వృత్తులు క్లిష్టములు .
అవి కాని సత్వ వృత్తులు అక్లిష్టములు .
ఆ ఐదు వృత్తులు ఏవి ?
సూ ! ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ
ప్రమాణము , విపర్యయము , వికల్పము , నిద్ర , స్మృతి అనేవి ఐదు చిత్త వృత్తులు
జీవుడు ప్రత్యక్షాది ప్రమాణములతో వస్తువులను ఎరిగి ఆసక్తి లేక ద్వేషములను పెంచుకొనును . కనుక వృత్తులు వాసనలకు , సంస్కారములకు ఉతపట్టి స్థానములు అవుతున్నాయి .
ప్రమాణం అంటే ఏది ?
సూ ! ప్రత్యక్షానుమానాగమాని ప్రమాణాని
ప్రత్యక్షము , అనుమానము , ఆగమము అని ప్రమాణము మూడు విధములు .
అంతకు ముందు తెలియబడనిది , అనుభవానికి రానిది ఛక్చు రాది ఇంద్రియములద్వారా తెలియబడేది అనుభవించబడేది ప్రత్యక్ష ప్రమాణము .
పరామర్శ , విమర్శ ద్వారా తెలియబడేది అనుమాన ప్రమాణం . శబ్ద జన్యమైన దానిని శబ్ద ప్రమాణం అంటారు .
ఇంద్రియాలతో సంబద్ధమైన బాహ్య వస్తువు యొక్క విశేష సామాన్య వివేచనము ప్రత్యక్ష ప్రమాణము – వ్యాస మహర్షి
సూ ! విపర్యయో మిధ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్ఠితం
రూపం లేని దానిలో రూప జ్ఞానం ప్రతిష్టించడం విపర్యయం . అంటే తాడును సర్పంగా భావించడం ( రజ్జుసర్ప భ్రాంతిఁ )
దీనినే అవిద్య అని కూడా అంటారు .ఇది ఐదు విధములు .అవిద్య , అస్మిత , రాగము , ద్వేషము , అభినివేశము
వికల్ప చిత్తవృత్తి లక్షణము ఏది ?
సూ !శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్ప
వస్తువేలేని శబ్దజ్ఞానాన్ని వికల్పము అంటారు . గొడ్రాలి బిడ్డడు , కుందేటి కొమ్ము , ఆకాశ కుసుమము మొదలైన వాటిలో భావన వికల్పము
నిద్రా స్వభావమెట్టిది ?
సూ ! అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా
జాగ్రత్స్వప్నాది వృత్తులలో ఉండే భావము లేని వృత్తి ఆలంబనగా కలిగినది నిద్ర
త్రిగుణాత్మకమగు చిత్తములో తమోగుణము అధికమై సత్వ రజో గుణములను ఆవరించినప్పుడు జీవి స్పృహ లేని అచేతనావస్థ లోనికి జారుకుంటాడు . ఇదే సుషుప్తావస్థ.