శ్రీమాత ఉద్భవ రహస్యం:
నా: శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞీ !’ శ్రీ’ ఆంటే అసంతులిత అనంత అసంకల్పిత స్థితి చైతన్య శక్తికి సంతులిత సంకల్పాన్ని ఇచ్చేది. ‘మాత’ ఆంటే పిల్లలపై ఎటువంటి స్వార్థ చింతన లేనిది తల్లి కనుక నవ విధ భక్తి రీతులున్నా ఆ శ్రీ లలితను తల్లిగా కొలిస్తేనే ఆమె స్వస్వరూప స్వభావమైన నిష్కామ సంకల్ప కర్మ సిద్ధినిస్తుంది. ‘మహారాజ్ఞీ’ ఆంటే సమస్తవిశ్వాన్ని ఆవరించి అంతర్లీనమై ఉన్న ఆ తల్లిని అలా చూస్తేనే ఆమె అనంత జ్ఞాన క్రియా శక్తులు మనకు లభించి మన స్థాయి పెరుగుతుంది. మహారాజ్ఞీ ఆంటే తన ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులతో సృష్టి స్థితి లయాలు నడుపుతున్నది కనుక.
యోగినీ హృదయానికి భాస్కర రాయలు వ్రాసిన సేతుబంధ వ్యాఖ్య ప్రకారం బిందువు నాలుగు రకాలుగా ఉంటుంది. కామకళ ( శివ శక్తుల ఐక్య పూర్ణ ప్రథమ స్వరూపం లేక కామ కళా విలాసం ప్రకారం తురీయంలో ఉన్న ప్రథమ బిందువు ), కామ బిందువు ( ప్రకాశ బిందువు లేక శక్తి స్థితి అంశ అయిన శివుడు ), విసర్గ ( విమర్శ బిందువు లేక శక్తి చైతన్య అంశ ), హార్ధ కళ ( మిశ్రమ బిందువు లేక సృష్టికి కారణమైన జాగ్రత్ స్వప్న సుషుప్తి, ఇచ్ఛా జ్ఞాన క్రియలు కలిగిన సమిష్టి రూపం – భౌతిక దైవిక ఆధ్యాత్మిక తత్వంగా పరిణతి చెందింది ).
నా: శ్రీమత్ సింహాసనేశ్వరి : పదార్థ, పశు, అసుర, మానవ ప్రవృత్తి కలిగిన ఈ శరీరమనే సింహాసనాన్ని అంతర్లీనమై అధిష్టించి బుద్ధితో మానవుని ఇచ్చా జ్ఞాన క్రియలను శాసించి సంతులిత సంకల్పం చేయించేది కనుక ‘శ్రీమత్ సింహాసనేశ్వరి’. సింహ ఆంటే కామ ప్రవృత్తి కలిగిన శివుణ్ణి ఆధీనంలోనికి తెచ్చుకొనేది అని అర్థం. ఆ లలిత మనిషి శరీరంలో అంతర్లీనంగా ఉంటే తన అంద చందాలతో శివుని స్వాధీనం చేసుకొన్నట్లు మనిషిని మాయా ప్రవృత్తికి లోను చేస్తున్నది. ఈ అంతర్గత శక్తిని ఊర్ధ్వంగా నడిపి బ్రహ్మరంధ్రం ద్వారా అనంత శక్తితో అనుసంధానం చేస్తే తల్లిగా మారి ముక్త స్థితి అయిన సమతుల్య సంతులన సంకల్పాన్ చేరుస్తుంది. ఇదే తల్లికి, భార్యకు ఉన్న భేదం. భార్యను ధరించాలి. తల్లిని ఆరాధించాలి. కూతురిని ప్రేమించాలి. అనేక రకాలుగా కనబడే విశ్వ యోని అయిన ఆ శ్రీ మాత చైతన్య స్వరూపాన్ని అందుకే స్త్రీ స్వరూపంగా సనాతన ధర్మం కొలుస్తున్నది.
చైతన్యభైరవి విష్ణు క్రియా స్వరూపమై సంపద్ భైరవిగా బుద్ధితో సృష్టిని చేయడానికి బ్రహ్మను సృష్టిస్తున్నది. ఆ బ్రహ్మ దీర్ఘ కాలం తన మూలం గూర్చి తపస్సు చేసి ఆ త్రిపుర సుందరి ద్వారా బుద్ధిని సాధించి సృష్టిని చేశాడు. ఆ సృష్టిలో ఇంద్రియాధిపతి అయిన ఇంద్రుడు తన సృష్టికి మూలమైన బ్రహ్మను గూర్చి తపస్సు చేసి తూర్పు దిక్కులో కూర్చుని తనలోని ప్రకృతిని శాస్సిస్తున్నాడు. ఆ తూర్పు దిక్కులో ఇంద్రుడు అనే సింహ ఆసనాన్ని అధిష్టించి శాసిస్తున్నది సింహాసనేశ్వరి. ఇక్కడ సింహాసనం అంటే శరీరమనే ఈ పశువును అధిష్టించి శాసించే పరా శక్తి ఆ పశువులోని అసుర గుణాలను గణాలను సంహరిస్తుంది అని అర్థం. మంచి చెడులను చెప్పే మానవ బుద్ధి ఆ శక్తి స్వరూపమే. శక్తి బుద్ధి ద్వారా జ్ఞానేంద్రియాలను, ప్రాణాన్ని, కర్మేంద్రియాలను, శరీరాన్ని శాసిస్తున్నది. కుండలినీ రూపంగా మూలాధారం లో ఉన్న ఆ శక్తిని జాగృతం చేసి సంతులన సంకల్పిత జ్ఞాన స్థిర చైతన్య శక్తిగా మార్చి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయించాలి.
ఆమె మూలాధారంలో జాగృతమై స్థిరమైతే శరీర బాహ్య అవయవాల చర్యలన్నీ సమతుల్యంగా ఉంటాయి. అదే అనాహతం చేరితే అక్కడ ఉన్న అసంకల్పిత చర్యలకు లోబడిన హృదయం మొదలైన అవయవాలు సంకల్పాధీనం అవుతాయి. ఆజ్ఞ లేక భ్రూమధ్యం లో ఉన్న బుద్ధిని చేరితే జ్ఞాన ప్రకాశం జరుగుతుంది. ఆజ్ఞను దాటి సహస్రారం ప్రయాణిస్తే శుద్ధ చైతన్య శక్తి జ్ఞానంతో సంకల్పంతో సంతులిత స్థిర చైతన్యంగా లేక శ్రీలలితగా మారుతుంది. ఆయా స్థాయిలలో ప్రయాణించే సమయాలలో బాహ్య ప్రపంచం, ప్రకృతి పైన ఆధిపత్యం కలిగి సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఈ కుండలిని జాగృతం సమస్త చర్యలలో ( యమ, నియమ, ఆసన ) శక్తిని ప్రత్యాహారంతో ఏకీకృతం చేసి భావిస్తూ, ప్రాణాయామంలో కుంభకంతో జాగృతం అవుతుంది. జాగృతం అయిన కుండలినిపై నిరంతర ప్రత్యాహార, ధారణ, ధ్యానాలతో అభ్యసిస్తే సమాధిలో శక్తి ఏక తత్వమై భాసిస్తుంది. అది ఆయా ఊర్ధ్వ చక్రాలలో చైతన్య, జ్ఞాన, శుద్ధ, సంకల్ప, సంతులిత శక్తిగా తన మూల రూపానికి పరిణామం చెందుతుంది. ఇదే లలిత శ్రీ లలితగా మారే శ్రీ (జ్ఞాన సంకల్ప సంతులిత శక్తి ) విద్య.
పద్మపురాణం ప్రకారం అన్నిలోకాలకు ఆవల అన్నింటిని సృష్టించే శృంగార క్రీడ ( వివిక్త సంకుచ ప్రసరణ తో పరస్పరాను ప్రవిష్టమై వాగర్థ సృష్టి – the enery has started forming as light and the visible matter in many permutations and combinations ( ratio ) of its duality has formed compounds and states of matter ) లో ఉన్నది కనుక లలిత అని అంటున్నది. సదాశివ మంచెపై త్రిగుణాతీతగా ఉన్న పరాశక్తి లలిత శివ శక్తులుగా రూపాంతరం చెందింది. శివ శక్తులు తమ మిథున పిండంతో భువనమండలాలను సృష్టించాలని లేక సృష్టించే క్రియా క్రమంలో లక్ష్మీ నారాయణులుగా మారారు. లక్ష్మీ నారాయణులు తమ క్రియకు ఆదిలో జ్ఞాన శోధనలో నాభి నుండి వాణీ బ్రహ్మ ల రూపాంతరం వచ్చింది. మొదటగా శక్తిని గూర్చి విస్తృతంగా అధ్యయన సాధనలను చేసిన వారు కనుక వీరిని ఆది గురువులన్నారు.
నా : చిదగ్నికుండ సంభూతా : బాహ్యంగా యజ్ఞ కుండం ద్వారా ప్రజ్వలించే అగ్నిలో నుండి కాంతి, వేడి, శబ్దం వెలువడుతున్నాయి. ఇది సృష్టి ఆదిలో శక్తి నుండి వచ్చిన కాంతి శబ్ద తరంగాలుగా అవగత మౌతున్నది. అంతరార్థంలో చిత్ అంటే బుద్ధి మధనంలో సత్ అంటే సత్య వస్తువు తన ఆనంద లేక సమతుల్య స్థితిని చేరడానికి ఉద్భవించిన జ్ఞాన శక్తి అని అర్థం. వీటినే బహిర్యాగం అంతర్యాగం అన్నారు. పూర్ణ శుద్ధ శక్తి స్వరూపంగా ఉన్న ఆ లలిత తనలో ఏర్పడిన అసమతుల్యత కారణంగా కాంతిని శబ్దాన్ని విడుదల చేస్తూ రూపాంతరం చెందుతూ వస్తున్నది. ఇది కామ కళా రూపంగా (the germ of desire ) గా మారడానికి కారణం ఇదే. ఈ కామ కళా రూపం తన సమతుల్యతను తిరిగి నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఆ ప్రయత్న పరిణామ రూపాంతరమే ఈ దృశ్య ప్రపంచ సృష్టి క్రమం.
అక్కడ కాంతి శక్తిగా తన రూపంగా ప్రకటించిన సమయంలో ఆ ప్రదేశం ఎలా ఉంది అని చెప్పడానికి సంజ్ఞలతో కూడిన శ్రీపురం లేక శ్రీ చక్ర నిర్మాణం, నామ వివరణతో ఖడ్గమాల, బీజాక్షర మంత్ర సాధనగా పంచదశిని మహర్షులు, తంత్ర సాధకులు తమ అతీంద్రియ అనుభవంలో తమలోని జీవ శక్తి పూర్ణ స్వరూపం ఆ పరా శక్తి రూపంగా గుర్తించి చెప్పారు. రుద్రయామళంలో ( లక్ష పైగా శ్లోకాలు ఉన్నట్లుగా చెప్తున్న ఈ గ్రంధం అతి కొద్ది శ్లోకాలతో మిగిలి ఉంది ) చెప్పినట్లు శ్రీపురం సమస్త భువనాలకు ఆవల వెయ్యి యోజనాల విస్తీర్ణంలో, ఇరవై ఐదు తత్వాలే గోడలు కలిగి ఆ పరాశక్తి మేరు రూపంలో మానవుని శరీరమై వసిస్తున్నది. దాని శిఖరం వెయ్యి కమలాలతో ఉన్న సహస్రారం అన్నారు. మేరు పర్వతాన్ని గూర్చి మరింత వివరంగా దుర్వాస మహర్షి లలితాస్తవ రత్నంగా చెప్పారు.
ఈ లలితా శక్తి చిదగ్ని కుండ ఆవిర్భావం గూర్చి పురాణాలలో పలువిధాలుగా ప్రస్తావించబడింది. ఇక్ష్వాకు వశస్తుడైన రేణు మహారాజు యజ్ఞం చేస్తే అగ్ని కుండంలోనుండి మహా తేజోవంతవమైన స్త్రీ శస్త్రాస్త్ర ఆయుధాలతో బయటకు వచ్చిందనీ ఒక ఇతిహాసం చెప్తున్నది. ఇది బాహిర్యాగానికి ప్రతీకగా కనపడుతున్నది. బ్రహ్మాండ పురాణంలో భండాసురుడు అనే రాక్షసుడు ఇంద్రుని బాధిస్తుంటే శతయోజనాల దూరంతో యజ్ఞ కుండం చేసి దేవతలందరు తమ దేహాలనే హవిస్సులుగా సమర్పించి చేసిన యజ్ఞం నుండి ముందు వేల కొలది సూర్య చంద్రుల తో సమానమైన జ్యోతిర్మయి కాంతి వెలువడింది. ఆ కాంతి మధ్య లో శ్రీ చక్రం,దాని మధ్యలో తేజో రూపం కలిగిన స్త్రీ రూపంలో ఆ శక్తి రూపు దిద్దుకొంది. ఆమెను చూసిన దేవతలు హర్షాతిరేకంలో ఆ శక్తికి నమస్కరించారు అని మార్కండేయ పురాణం ( దేవీ సప్తశతి ) లో చెప్తున్నది. ఈ కథ అంతా ఇంద్రియాధిపతి అయిన ఇంద్రుడు శరీరమే యజ్ఞకుండంగా చేసిన అంతర్యాగానికి శరీరంలో రక్త మాంస సహితమైన ఇంద్రియాలే హవిస్సులుగా ప్రాణమనే ఇంధనంతో వేల్చగా ( ప్రాణాన్ని శక్తిగా ఉదాన శక్తిగా ) అందుండి ఆ మహా శక్తి ఉద్భవించినట్లు( లేక బుద్ధి అయిన ఇంద్రునికి అవభూతమైనట్లు ) చెప్పుకోవచ్చు.
బహిర్యాగం ఏకాగ్రత కొరకు మొదట అభ్యసించిన విద్య అయితే అంతర్యాగం పరిణతి చెందిన మహర్షులు చేసిన తపస్సు, యోగం, కుండలినీ జాగృతిగా చెప్పుకోవచ్చు. ఇక భండాసురుడు ఎవరంటే జీవిని లేక జీవ శక్తిని పదార్ధం తో కూడిన శరీరానికి బంధించి శరీరంలో జీవ క్రియలు సరిగా జరగకుండా చేసే నిర్జీవ తత్వం గా లేక భౌతిక శరీర సుఖాలే ముఖ్యంగా తమో గుణంతో ( అరిషడ్వార్గాల పూర్ణ స్వరూపం ) ఉన్న అసుర శక్తి సమూహం. ఈ భండాసురుని వధించాలంటే జీవ శక్తి గా ఉన్న లలితా శక్తి జాగృత మై పదార్థంతో నిర్మించబడిన శరీరం, దాని ఇంద్రియ తత్వాలను ఆధీనంలోనికి తీసుకొని తమోగుణాన్ని, అరిషడ్వార్గాలను వధించడం అని అర్థం. పరిణామస్ఫూర్తి కలిగిన జీవ శక్తి ఇంద్రుడు పంచ భూతాలను, దిక్పాలకులతో సుషుమ్న లోని అనాహత భాగాన్ని సుఖ శాంతులతో పాలిస్తూ ఉంటాడు.
ఆ జీవ శక్తి మూలాధారం చేరినప్పుడు సుషుప్త కుండలిగా మారి తిరిగి తమోగుణ ప్రధానమైన అసుర శక్తులు అరిషడ్వార్గాలు గా విజృంభిస్తూ ఉంటాయి. మూలాధారంలో ఉన్న శక్తి జాగృతమై ఊర్ధ్వ ముఖంగా ప్రయాణించి ప్రాణాన్ని, జీవ క్రియలను సమర్థంగా నడిపి బుద్ధిని శుద్ధ చైతన్యంగా లేక చిత్ గా లేక జ్ఞానంగా నడిపితే గానీ సంకల్ప సంతులిత పరిణామం ముందుకు సాగదు. ఈ జాగృత కుండలిని శక్తి సుషుమ్నలో ఆయా చక్రాలలో ఉన్నప్పుడు స్ధాయిని బట్టి సాధకునికి తన శరీరంపై, ఇతరులపై, ప్రకృతి పై ఆధిపత్యం కలిగి ఉంటాడు. తద్వారా తన జీవితాన్ని పంచభూత మయమైన ప్రకృతి అధీనం కానీక ఆ పంచభూతాలకు మూలమైన పరాశక్తి అధీనం చేస్తాడు. అప్పడు దేహమయమైన జీవునికి ఆ పరా శక్తికి భేదం ఉండదు. ఈ శక్తి సుషుమ్నలో సహస్రారం చేరగానే ఆ పరాశక్తి శ్రీ లలితగా భాసిస్తుంది.
స్థిరమై, జ్ఞానవంతమై, స్వీయ సంకల్పంతో, శాశ్వత సంతులిత తత్వంగా మనుగడ సాగిస్తుంది. జీవి నిరంతరం స్థిర జ్ఞాన చైతన్య శాశ్వత సత్య సంతులిత సంకల్ప శక్తిగా మనుగడ సాగిస్తే విశ్వమే అధీనంలో ఉంటుంది లేక విశ్వ శక్తిలో తాను ఇచ్ఛా జ్ఞాన స్వరూపుడై ఉంటాడు. అటువంటి వారు భౌతిక, మానసిక, సాంఘిక, ఆర్ధిక, ఆధ్యాత్మిక జీవితాన్ని తమ అధీనంలో (choice ) ఉంచుకొని ప్రకృతి అధీనం ( chance ) నుండి బయటపడి తమ గమ్యాన్ని ( జీవితంలో నైన మరణంలోనైనా ) తామే నిర్మించుకొంటారు. ఇది పంచ భూతాలు ( అగ్ని, వాయువు, జలము, ఆకాశం, భూమి ) వాటి నుండి వచ్చిన ఇంద్రియాలు అనే దైవీయ శక్తుల మనుగడ, చైతన్యాన్ని కాపాడడానికి ఆ పరా శక్తి జీవ శక్తిగా చూపుతున్న ఉత్సాహం కనుక ఆమెను ఈ క్రింది నామంతో పిలిచారు.
శ్రీ మాత ఉద్భవ లక్ష్యం:
నా ! దేవకార్య సముద్యతా ! దేవకార్యమైన భౌతిక మానసిక సుఖ శాంతులు, జ్ఞాన, పరిణామ వృద్ధికి వారు చేసే ప్రయత్నాలకు ఉత్సాహంగా చేయూత నిచ్చేది ఆ జాగృత చైతన్య కుండలి. దేవతలలో ఆది శక్తిని చేరాలనే తాపత్రయాగ్ని వారి ఇంద్రియ ప్రభావాలను శరీరం పై లేకుండా భస్మం చేస్తుంది ( the fire of devataas in the form of their desire to ascend to higher realms of sushumna to meet the eternal destiny makes them immortal burning their sins and with the nullification of their sensual attachment to physical body ). ఆ పరా శక్తి సత్య శాశ్వత స్థిర చైతన్య సంతులిత రూపమైనా జీవ పరిణామానికి ముందు అసంకల్పితంగా (తన సహజ ప్రకృతిలో – random assortment of balance and imbalance without any decisive existence, expansion and continuance ) ఉంది.
జీవ పరిణామంతో జ్ఞాన వృద్ధి జరిగి సంతులితమే గమ్యంగా స్థిర సంకల్పంతో తన పరిణామ గమ్యమైన స్థిర జ్ఞాన శాశ్వత సత్య సంతులిత చైతన్యం వైపు అడుగులు వేస్తున్నది. అందుకే ఏ సాధకునిలో అయినా శాశ్వత సత్యమైన ఆ అసంకల్పిత శక్తి సంకల్ప శక్తిగా మారినప్పుడు ఆ శక్తి ప్రస్థానం అక్కడ కొత్తగా పుట్టినట్లుగానే అర్థం అని మార్కండేయ పురాణం చెప్తున్నది. పురాణాలు వేదాలను చెప్పడానికి వివిధ ఇతిహాసాలలో శివ వైష్ణవ పాంచరాత్ర తత్వాలకు జీవం పోసినా కడకు ఆ పరా శక్తి మనుగడే వీటన్నిటికీ కారణమని గుర్తించాయి. ఇదే దేవీ భాగవతానికి, శాక్తేయ ఆగమాల ఆవిర్భావానికి కారణమైంది.
కూర్మపురాణంలో దేవి ” నా తండ్రి దక్షుని అహంకారాన్ని అగ్నిలో ( శరీరాన్ని శక్తి లో )వేల్చి చంద్రుని వంటి ప్రశాంత చిత్తుడివి, హిమవత్ పర్వతం వంటి చల్లని వాడివి అయిన నీ ఇంట మేనావతి కడుపున పుడుతున్నాను” అని చెప్తున్నది. దీనర్థం ఆ జగన్మాత ప్రతి శరీరంలో అంతర్లీనమై ఉండి అరిషడ్వార్గాల ను అహంకారం అనే అగ్నిలో భస్మం చేసి చల్లబడితే మహత్తత్వంగా ప్రాణం పోసుకొంటున్నది అని అర్థం.
Om Tat Sat!