Sri Vidya – The Eternal Energy Code Part 2

శ్రీ మాత ఉద్భవం తరువాత ఎలా ఉంది: శ్రీ లలిత బాహ్య ప్రకృతి సౌందర్య లహరి :

నా ! ఉద్యద్భాను సహస్రాభా ! సహస్ర కోటి సూర్యులు ఒక్కసారి ఉదయించినట్లుగా ఆ పరా శక్తి  యజ్ఞంలో అగ్ని గుండం నుండి వెలువడింది.

యోగవాసిష్టంలో ఆ దివ్య పురుషుడు ” ఓ పుణ్యపురుషుడా నేను అపర ( అవయవ సహితమైన శరీరంలోనూ ) పర (అవయవ రహితమైన శక్తి రూపంలోనూ ) రెండు రకాలుగా ఉన్నానని చెప్తున్నాడు. ప్రకృతి ఇంద్రియాలకు అధీనమైన పదార్థ బద్ధమైన శరీరంలో పాలల్లో నీళ్లలాగా అంతర్లీనమై ఉన్న శక్తి  ఒక వైపు,  బంధ విముక్తమై జాగృత కుండలిగా శరీరాన్ని అంతర్గతంగా ఉండి శాసిస్తున్న శక్తి ఒక వైపు రెండు రకాలుగా రూపాంతరం చెందుతూ కనిపిస్తూ ఉంటుంది. నా పరా శక్తి అనంతమై, శాశ్వతమై, సత్యమై ఆత్మ, బ్రహ్మ, పరమాత్మగా పిలువ బడుతున్నది అని అంటున్నారు. ఇదే విషయాన్ని ఋగ్వేద సుపర్ణా సూక్తంలో ‘చెట్టుపై ఉన్న రెండు చిలుకలలో ఒకటి సమస్త జీవ చర్యలు నడుపుతూ ఉంటే రెండవది సాక్షి మాత్రంగా చూస్తున్నది అని చెప్తున్నది’. 

అదే స్వచ్ఛంద తంత్రంలో ” ఆ పరాశక్తి ఉదయించినప్పుడు ఆ వెలుగులోని చంద్రుని తెలుపుదనం ప్రకాశ శక్తి అయితే అందులోని ఎరుపుగా ఉన్న అగ్ని తత్వం నిత్య మేధో మధనం చేసే విమర్శ శక్తి” అంటున్నారు. ఈ విమర్శ శక్తిని ఆ ప్రకాశ శక్తి పైనే సంధించి ధ్యానం చేయాలి. వామకేశ్వర తంత్రంలో ” ఆ ప్రకాశమే ఆ పరాశక్తి నిజ తత్వమని, ఎరుపు రంగులో ఉన్న ఆ విమర్శ రూపాంతరమే”  అని చెప్తున్నది.  అంటే ఏ రూపం ధరించినా ఆ పరా శక్తి ఒక్కటే అయిన ఏకవీర అని అర్థం. 

ఆ ప్రకాశ విమర్శల ఐక్య పరా శక్తి మరింత రూపాంతరం చెంది  స్థూల ( పదార్థ బంధమైన శరీరంలో ) సూక్ష్మ ( బీజాక్షర శబ్ద మంత్రమయమై ) కారణ (అన్నిటికీ మూల కారణమై ) ఉన్నది. ఆ స్థూల దేహం నాలుగు చేతులను నాలుగు ఆయుధాలను  కలిగి వుంది. 

నా ! చతుర్బాహు సమన్వితా రాగ స్వరూప పాశాఢ్యా ! నాలుగు చేతులు నాలుగు ఆయుధాలు ధనుర్బాణ పాశ అంకుశాలను కలిగి వుంది. అంటే ధనుర్బాణాలను సంధించి ( శరీర మనస్సులను )ఏకాగ్రతతో ప్రాణమనే పాశంతో బంధించి అంకుశం అనే బుద్ధితో అరిషడ్వార్గాలను అదుపులో ఉంచుకొనేది అని అర్థం. ఇంకా వీటి నుండి పుట్టిన రాగము ( రాగమంటే వాసనతో కూడిన ఇచ్ఛ దాని తీవ్ర రూపమైన పాశాన్ని ఎడమ చేతిలో ధరించి అదుపులో పెట్టేది.

నా ! క్రోధాకారాంకుశోజ్వలా ! కుడి చేతిలో అంకుశాన్నీ ధరించి కోరిక నుండి వచ్చి జ్వాలగా వెలిగే క్రోధము దానికి సంబంధించిన జ్ఞానాన్ని అదుపులో పెట్టుకొన్నది. 

తంత్ర రాజం కొద్ది భేదాలతో చెప్తూ ” బుద్ధి చెరుకుగడ విల్లు గానూ, కోరిక పాశంగానూ, క్రోధము అంకుశం గానూ, ఐదు తన్మాత్రలు ఐదు బాణాలుగా చెప్తున్నది. యోగినీ హృదయం వీటిని ఇఛ్ఛా ( పాశం ),  జ్ఞానం ( అంకుశం ),  క్రియా ( ధనుర్బాణాలు ) శక్తులు గా చెప్తున్నది. ఏ విధంగా చెప్పినా ఆయా బలహీనతలకు ( సుషుప్తిలో ) వాటి నివారణకు ( జాగృతమైనప్పుడు ) కారణమైనది ఆ పరాశక్తే అని తెలుసుకోవాలి. 

నా ! మనో రూపేక్షు కోదండా ! మనస్సునే కోదండాన్ని ధరించినది. మన్మధుడనే కోదండంతో కామాన్ని పెంచేది అదే కోదండంతో వాటిని తుంచేది అని అర్థం. మనస్సు యొక్క సంకల్ప వికల్పాలతో ఇవన్నీ జరుగుతాయన్నది అందరికీ తెలిసిన సత్యమే. కాది మాత లో చెప్పినట్లు ఈ బాణాలు స్థూల( పువ్వులు – పద్మ, రక్త కైరవ, కల్హార, ఇందీవర, మామిడి ),  సూక్ష్మ ( మంత్రాలు ),  కారణ ( వాసనలు ) అని మూడు రకాలుగా సాధకుని స్ధాయిని బట్టి ఉంటాయి. కాళికా పురాణం ప్రకారం ఈ ఐదు బాణాలు ఆనందాన్ని, సుఖాన్ని, భ్రమను, సందేహాన్ని, మరణాన్ని కలుగ చేస్తున్నాయి. 

నా ! పంచ తన్మాత్ర సాయికా ! తన్మాత్రలనే ఐదు బాణాలు ( శబ్ద, స్పర్శ,  రూప, రస, గంధాలు ) ఆమె కుడి పై చేతిలో ఉండి మనస్సు తో కోరికల పై సంకల్ప వికల్పాలను కలుగ చేస్తున్నాయి.

నా ! నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండలా ! అరుణ కాంతులతో నిండి ఉన్న ఆ జగజ్జనని ఈ బ్రహ్మాండంలోని అన్ని మండలాలను వెలిగిస్తున్నది. ఆ ప్రథమ శక్తి నుండి వెలువడిన కాంతి ఈ దృశ్య ప్రపంచానికి కారణమని అందరికీ తెలిసిందే. ఆ వెలుగూ ఆమెనే,  ఆ వెలుగుకు కారణం కూడా ఆమెనే. జీవ శక్తిలోని ఆ తేజస్సు తన్మాత్రల ద్వారా జీవితంలోని ప్రతి అనుభవానికి కారణమౌతున్నది. తన శక్తితో బాహ్య అంతర ప్రపంచాన్ని ఆవరించి వుంది. 

నా ! చమ్పకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా ! బాహ్యార్థం ఆ తల్లి కురులు చంపక, పున్నాగ, సౌగంధిక,  అశోక పుష్పాలతో అలంకరించబడ్డాయి అని అర్థం. అంతరార్థం ఆ తల్లి కురుల నల్లదనమనే రాత్రిని వెలిగించడానికి ప్రకాశము, సువాసన కలిగిన పుష్పాలను  కలిగి వుంది అని అర్థం. 

నా ! కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా ! పద్మరాగమని చెప్పబడే శ్రేష్ఠమైన కురువింద వంటి అనేక మణులతో అలంకరించబడి వెలుగుతున్న ఆమె కిరీటం అని బాహ్యార్థం. ఈ సృష్టిలోని సమస్త మణులు, మాన్యాలు, కనకం వంటి విలువైన వస్తువులను తన కిరీటం కొరకే సృష్టి చేసి ధరించినదా తల్లి అని అర్థం. అంటే ఈ దృశ్య ప్రపంచమే ఆమె అయినప్పుడు అందులో నుండి వచ్చిన ఈ వస్తువులు ఆమెకు అలంకారం కావడంలో వింత ఏముంటుంది. పుష్ప, మణులు, కనకం ఇవన్నీ ఈ భూమికి ( ప్రకృతి రూపమైన పరా శక్తికి ) అందమే కదా.

నా ! అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా ! అష్టమీ తిథిలో చంద్రుని లాగ ఆమె నొసలు ప్రకాశ వంతమై వుంది. భూమిపై నుండి చల్లని ప్రకాశవంతమైన రాత్రి చంద్రుని చూడగానే నొసలు భాగంలో ఉన్న భ్రూమధ్యం, మనస్సు ప్రశాంతతకు లోను కావడం అందరికీ అనుభవమే కదా ! ఈ దృశ్య ప్రపంచం, భూమి, ప్రకృతి, అగ్ని సూర్య చంద్రులు, ఈ మానవ శరీరం అన్నీ ఆ పరమేశ్వరి నుండి రూపాంతరంలో వచ్చిన రూపాలైనప్పుడు ఆ అందము అనుభవాలు అందరివీ అవుతాయి. ఇవన్నీ మానవుడు ప్రకృతిలోని శక్తి అంశాన్ని దివ్య ఆధ్యాత్మిక దృష్టితో చూసి జీవితాన్ని నిత్య నూతనంగా ఉంచుకోవడానికి పనికి వస్తాయి. మానవ జీవితంలో అనేక సార్లు నిత్య నైమిత్తికాలతో విసిగినప్పుడు ప్రకృతిగా ఉన్న ఆ పరాశక్తి అందాలలో అనేక జ్ఞాన,  అనుభవాలు (కుండలిని  సుషుమ్న స్ధాయిని బట్టి ) కలిగి జనన జీవన మరణాలకు మధ్య కొత్త అధ్యాయాన్ని, స్వాధ్యాయాన్ని ఇస్తాయి. 

నా ! ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక ! చంద్రునిలో ఉన్న మచ్చ లాగ చంద్ర బింబం వంటి ఆమె నుదుటి కస్తూరి తిలకం ఉన్నది. కనపడే ప్రకృతి,  భూమి, ఆకాశం అంతా ఆమె శరీరం అయితే చంద్ర బింబం ఆమె ముఖంగా, అందులోని మచ్చ కస్తూరి బొట్టుగా మనకు కనపడుతుంది.  చంద్రుని మచ్చను చూసినా,  సింధూరం లేక కస్తూరి తిలకం నుదుట ధరించిన ఎవరిని చూసినా భ్రూమధ్య ఆజ్ఞా చక్రం ప్రేరితమై అనిర్వచనీయమైన ఆనందం,అలౌకిక జ్ఞానం స్ఫురణకు వస్తాయి. అందుకే బొట్టు పెట్టుకొన్న స్త్రీలకు, పురుషులకు అందరికీ ఆ గౌరవం దక్కుతుంది. 

నా ! వదనస్మర మాంగళ్య గృహ తోరణ చిల్లికా ! చక్కటి వంకర తిరిగిన ఆమె కనుబొమ్మలు మంగళకరమైన గృహ తోరణాలుగా ఉన్నాయి. పండుగలలో, పవిత్ర దినాలలో మనం ఇంటికి తోరణాలు కట్టేది ఈ అనుభవం కొరకే. వర్షాకాలంలో ప్రకృతికి ఇంద్రధనస్సు తోరణంగా ఉన్నట్లు ఉంటుంది. చక్కటి అందమైన స్త్రీ పురుషుల కనుబొమలు ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలుగ చేస్తాయి. ఈ వర్ణనలన్నీ భౌతికంగా స్త్రీ పురుషులకు,  దివ్యంగా మానవ ప్రకృతికి, ఆధ్యాత్మికంగా పదార్థ శక్తి లేక శివ శక్తుల మధ్య ఉన్న అవినాభావ సంబంధ ఆకర్షణలు చెప్పడానికి చేసిన ప్రయత్నం. ప్రకృతి, పురుషుడు ఆమెనే కనుక ఆమె శరీర అవయవ సౌందర్యంతో వారి భావ వ్యక్తీకరణకు  చేసిన ప్రయత్నం. అంతే గానీ ఆ పరా శక్తి ఒక స్త్రీ అని గానీ ఆమె సౌందర్యారాధన చేసినట్లు అని కాని కాదు. స్త్రీ పురుషుల మధ్య ఉన్న ఆకర్షణకు రూపమే ఆ పరాశక్తి. 

నా ! వక్త్ర లక్ష్మీ పరీవాహ చలఞమీనాభ లోచనా ! కొలను లాంటి ఆమె వదనంలో చేపలాంటి ఆమె కనుబొమలు  ఈదుతున్నాయా అన్నట్లు కనపడుతున్నాయి. భౌతికం నుండి ఆధ్యాత్మికానికి,  మూలాధారం నుండి సహస్రారం చేరడానికి మధ్య ఉన్న అనాహతం, జ్ఞానం దాటవలసి ఉంటుంది. అనాహతం హృదయంతో సౌందర్యోపాసన( ప్రకృతిలో అందాలను – స్త్రీ పురుషునిలోనూ, పురుషుడు స్త్రీలోనూ ), ఆజ్ఞ జ్ఞాన పిపాస కలిగి ఉంటాయి. ఆ ఉపాసన, పిపాసలను దేహంతో కాకుండా మనస్సుతో ఆస్వాదిస్తే బంధ కారణం లేని ఆనందం ఉంటుంది. ఇక్కడ సనాతన ధర్మంలో ప్రకృతిని,  స్త్రీ ని నిస్వార్థంగా జన్మ నిచ్చి పెంచే తల్లితో పోల్చారు కనుక ఆ పోలిక ఈ లలితా సహస్రనామంలోని మొదటి కొన్నిశ్లోకాల్లో ప్రతిఫలిస్తుంది.  పై నామంలో ఒక పక్క ఆ శ్రీ లలిత అందమైన కనుబొమలను చూస్తూనే ఆమెపొలిక కొలనులోని చేపలతో పోల్చి స్త్రీ అందంతో ప్రకృతి అందాలను కలిపి అలౌకికమైన ( కామవాసన లేని లేక ప్రభావం కలుగకుండాచేసి ) శ్రీ లలితను ఆరాధించారు. ఈ క్రమ మూలాధార, అనాహత, సహస్రార దృష్టి, భావన, అనుభవాల ప్రయాణమే ఫలాపేక్ష లేని బంధ విముక్తి కలిగించే కర్మయోగం. ఇక  ఆమె అందాన్ని వర్ణించే మరికొన్ని నామాలు ఈ తరహా భావనతోనే చూడాలి. 

నా ! నవ చంపక పుష్పాభ నాసాదండ విరాజితా ! అప్పుడే పూసి వేలాడే చంపక పుష్పమా అన్నట్లు ఆమె నాసిక కనబడుతూ ఉన్నది. చుట్టూ కనబడే ప్రకృతి అంతా ఆమె ముఖ బింబమైతే ఆమె నాసిక అందులోని చంపక పుష్పం లాగా కనబడుతున్నది. 

ఇంత అందాన్ని వర్ణించాక వేరే కామ వాసనలు జనించవా అంటే “యద్భావం తద్భవతి”. తల్లిని కామించే పశు లక్షణమైన ఎడిపస్ కాంప్లెక్స్ ఉంటే ఏమీ చేయలేము. దుర్గావతారం లో మహిషుని, చండిక గా శుమ్భ నిష్యంబు లను ఆ రకంగానే ఆకర్షించి ఆ తల్లి అసుర లేక వారి ప్రవృత్తుల సంహారం చేస్తుంది. మానవునిలో బ్రాన్తి కలిగించినా,  తొలగించినా అది వారి జన్మ కర్మ ఫలానికి సాక్షి స్వరూపంగా ఉన్న  ఆ దేవి ఇచ్చే ఫలితమే. 

నా ! తారాకాంతి తిరస్కార నాసాభరణ భాసురా ! మాణిక్య మౌక్తికాలతో ఉన్న ఆమె ముక్కు పుడక తళుక్కుమని మెరుస్తూ రాత్రి పూట మేఘావృతం కాని ఆకాశంలో మిణుకు మిణుకు మని మెరిసే ఆ తారల కాంతిని తిరస్కరిస్తూ (అంటే వాటికి పోలిక లేకుండా చేస్తూ ) వుంది. ఇంతవరకు ప్రకృతి తో పోలుస్తూ ఇప్పుడూ వినీల ఆకాశం, అందులోని తారలతో పోలుస్తూ సనాతన భారతీయ అలంకరణతో  సర్వాంగ సుందరంగా తొణికిసలాడే భారతీయ స్త్రీ ని భూమి , ప్రకృతి, గ్రహ, నక్షత్ర సముదాయంతో ఆ విశ్వ వైవిధ్యాన్ని చూపుతున్నారు. అందుకే అటువంటి అలంకరణతో ఉన్న స్త్రీ మూర్తిని అసుర ప్రవృత్తిలేని మానవులు ఎవరు చూసినా వారికి గౌరవ భావం కలుగుతుంది. అసురులైతే దాని పరిణామం మూలాధార బాలా శక్తి బంధించి దానికి తగిన పరిణామ పశు ప్రవృత్తిని పెంచి చివరకు వారి జీవ తత్వాన్నే నాశనం చేస్తుంది. 

మానవులలో  జీవన గమ్యం కామ్య ( నిత్యం ఆకలి, కామ, భోగ లాలస మొదలైన వాసనలతో స్వీయ శరీరారాధన లేక భౌతిక లక్ష్యం వైపు ( sigmund freauds id or Ayan Rand’s existence or Jean Paul Satre’s existentialism), కుటుంబ,  సాంఘిక గుర్తింపు మనుగడకై ఆరాట పోరాటాలు లేక దివ్య తత్వం వైపు ( Freaud’s Ego or Ayan Rand’s consciousness and its passion for identity in society ), తరువాత తానెవరో తెలుసుకొని తన శాశ్వత తత్వం వైపు నడవాలనే స్వస్వరూప ఆరాధన అనే ఆధ్యాత్మిక తత్వం వైపు నడుస్తారు. జీవ లక్ష్యం ఈ రకంగా జరిగే ఒక పరిణామ ప్రయాణం. అది జన్మ సిద్ధులకు బాల్యంలోనే వస్తే, సాధనా సిద్ధులకు వయసుతో పాటు పెరుగుతుంది. ఎవరికైనా, ఏ వయసులోనైనా మనిషిగా తన పరిణామ పరిజ్ఞానం ఉండాలి. విద్యలన్నీ వ్యక్తిని ఆ వైపు మళ్లించాలి ( physical, psychological, economical,  social and philosophical or spiritual foundations of life and education as enumerated in idealism). ఇదే జీవితంలో మనిషికి ఆయా వయస్సులలో సరి అయిన దృష్టిని కలుగ చేసి సుఖ శాంతులతో పాటు,  పేరు ప్రతిష్టలు, ఆధ్యాత్మిక ఔన్నత్యం కలిగించి జీవ పరిణామ లక్ష్యం వైపు తీసుకుపోతుంది. కర్మ  జన్మ జన్మాన్తరః ప్రభావం కలిగిస్తుంది అని నమ్మినా నమ్మకపోయినా ఈ జన్మలో బాగుండాలన్నా ఈ దృష్టిని కలిగి ఉండక తప్పదు. 

నా ! కదంబ మంజరీక్లప్త కర్ణ పూర మనోహరా ! అందమైన కదంబ పుష్ప సమూహాలుగా కనబడుతున్న  దుద్దులతో ఆమె కర్ణాలు అందంగా అలంకరించబడ్డాయి. పైన చెప్పినట్లు ఆమెను ప్రకృతిగా చూస్తే ప్రతి అవయవం, వాటి అలంకరణ ప్రకృతి అందాలు గానే కనబడతాయి. ఇక్కడ స్త్రీ సౌందర్యం లో ప్రకృతిని చూడాలి గానీ ప్రకృతి తో పోల్చబడిన స్త్రీని కాదు. 

నా ! తాటంక యుగళీభూత తపనోడుపమండలా ! సూర్య చంద్రుల కాంతి లాగ వెలుగుతున్న ఆమె కర్ణాభరణ మణులు వెలుగుతున్నాయి. అందమైన ప్రకృతిని చూసేటప్పుడు చుట్టూ గమనించినట్లు సర్వాభరణ భూషిత అయిన స్త్రీ ని ఒక్క చూపుతో  నఖ శిఖ పర్యంతం ఆమె పూర్ణ స్వరూపాన్ని  గమనించడం, దర్శించడం జరుగుతుంది. 

నా ! పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ ! ఎరుపెక్కిన ఆమె బుగ్గలు నవరత్నాలలో ఒక్కటైన పద్మరాగమణి ( కెంపు ) ని పోలి ఉన్నాయి. ఇది కూడా ప్రకృతి లాగా పూర్ణ అందంతో తొణికిసలాడుతున్న స్త్రీత్వం యొక్క పోలిక. అంతే గాక సూర్యోదయానంతర కాలంలో, సంధ్యను చూస్తే  ఆకాశం ఎరుపెక్కి ఉన్న పోలిక లాగ ఉంటుంది. శరీరం నుండి మనస్సుకు,  స్త్రీ నుండి ప్రకృతికి భావం ప్రవహించడానికి చేసిన కావ్యాలంకార ప్రయత్నం ఇది. మానవుని మూలాధార భావం నుండి సహస్రారం వరకు ఈ భావ, భావుక ప్రయాణం అద్వితీయమైన భౌతిక,  దివ్య, ఆధ్యాత్మిక అనుభవాలతో కూడి ఉంటుంది. వాటికి అక్షర రూపమే ప్రకృతిగా ఆ దేవి భౌతిక, దివ్య,  ఆధ్యాత్మిక  క్రమ ఆరాధన. అందుకే అర్థ సహితంగా, భావనోద్వేగంతో, చైతన్య ప్రసారాణానుభవంతో కంఠోపాఠం చేసి పారాయణం చేస్తూ ఉంటే అక్షరాలు మాయమై, అర్థం,  భావంలో ఆ దేవిని దర్శించి, చివరకు ఆ దేవి తాననే అనుభవం వస్తుంది. అప్పుడు త్వమేవాహం అనిపిస్తుంది. ఇదే యోగంలో ధ్యాన, ధారణలతో కూడిన  సమాధి లేక ఏకత్వ ( జ్ఞాత,  జ్ఞానం, జ్ఞేయం ) సిద్ధి సాధన. ఈ సాధన ముందుకు పోకపోతే ఎక్కడ ఆగితే అంతవరకే ఫలితాలు వస్తాయి. 

నా ! నవ విద్రుమబింబ న్యక్కారి రదనచ్ఛదా ! ఆ లలితాదేవి పెదవులు ఎర్రగా పండిన బింబ ఫలాన్ని ( దొండపండు ) వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి. ప్రకృతిలో దోరమాగిన దొండపండును చూడగానే కలిగే తన్మయత్వం. ఎరుపు సహజంగా అనేక భావాలను కలుగ చేస్తుంది. గుణాల స్ధాయిని బట్టి కామ క్రోధ లక్షణాలను కూడా కలుగ చేస్తుంది. కనుక చూసే దృష్టిని బట్టి ఉంటుంది. పరిణామ పరిణతి అనే సరళరేఖపై ‘ విద్యాతురాణాం న సుఖం న నిద్ర ‘ అనే ఏకాగ్ర దృష్టి ఉంటే పెడితే వక్ర దృష్టి కలుగదు. 

నా ! శుద్ధ విద్యా అంకుర ద్విజపంక్తి ద్వయోజ్వలా ! శుద్ధ విద్య అంటే శ్రీ విద్య అంకురించినప్పుడు తళుక్కుమని మెరిసే జ్ఞానోదయమా అన్నట్లు ఆమె రెండు పలువరుసలు మెరుస్తూ ఉన్నాయి. సర్వాంగ భూషిత సర్వ లక్షణసమన్విత అయిన పద్మినీ జాతి స్త్రీ కొద్దిగా విచ్చుకొన్న దరహాసంలో కనపడి  మెరిసే పలువరస చూపరులకు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. 

ఆ తల్లిని స్త్రీ స్వరూపంగా, ప్రకృతి స్వరూపంగా ఏకం చేసి చూస్తూ క్రమంగా అందులో తమ శరీర భౌతిక మానసిక అనుభవాలను చెప్తూ ఆధ్యాత్మికత వైపు ( కుండలినీ జాగృతి,  ప్రయాణం వైపు ) తీసుకుపోవడం ఇది. కుండలినీ జాగృతి సహజంగా ప్రాణం స్తంభించే భావ ఉద్రిక్తత ( అది భౌతికం లేక మానసికం కావచ్చు ) లో గానీ లేక ప్రాణాయామ కుంభకంలో గానీ జరుగుతుంది. భౌతిక భావ ఉద్రిక్తత క్షణికం అయితే,  మానసిక ఉద్రిక్తత ఆ భావాన్ని కొనసాగిస్తుంది, కుంభక సాధనలో అది కేవల కుంభకంగా మారి ప్రాణం చైతన్య లేక చిత్ శక్తిగా మారి బుద్ధి ( స్థిర చైతన్య సంతులన జ్ఞాన శక్తి ) ఆధీనంలోనికి వస్తుంది. మూలాధారంలో అరిషడ్వార్గాలను ప్రేరేపించే ఆ బాల అనాహతంలో మోహ పాశ బద్ధం  చేస్తూ ఆజ్ఞలో జ్ఞాన పిపాసను కలుగ చేస్తుంది. ఈ స్థాయిలను సాధనతో  దాటితే అది చైతన్యం నుండి చిత్ గా లేక బుద్ధి గా మారి ఆ తరువాత స్థిర చైతన్య సంతులిత సంకల్ప జ్ఞాన శక్తిగా సత్య భావం శాశ్వతమై నిలబడుతుంది. ఈ స్థాయి అనుభూతి వచ్చిన తరువాత చేసే ప్రతి పనీ ఆ సంతులిత స్థాయి నుండి జరుగుతుంది కనుక శరీర అవయవాల ప్రతి కదలిక ఆ శ్రీ లలిత పూజగా మారుతుంది. ఆ స్థాయిలో సమస్త భావోద్వేగాలకు ( అరిషడ్వార్గాల ప్రభావం వల్ల కలిగే )పరిసరాల  సంతులిత సమన్వయ అవసరానికి ఉపయోగపడతాయి. ఈ స్థాయిలో సాధకుడు ప్రకృతి మూల స్థితి అయిన అణు రూపం నుండి ( అణిమాది సిద్ధులతో – తానే అణురూపం ( అణిమ )అయినప్పుడు దాని బాహ్య రూపాన్ని తన చైతన్యంతో విస్తరించడం ( గరిమ ) ఎక్కడైనా ఏదైనా చేయగలగడం ( (మహిమ), ఎక్కడికైనా ప్రయాణించగలగడం ( ప్రాకామ్యము ),  సమస్త సృష్టి అధీనం లో ఉండడం ( వశిత్వం ) కోరినది లభించడం ( ప్రాప్తి ) సమస్త ప్రకృతికి మధ్యలో స్థిర జ్ఞాన చైతన్య రూపంతో ( ఈశిత్వమ్ ) సంకల్పం చేస్తాడు. కనుక జీవ, నిర్జీవ ప్రకృతి, తరువాత సమస్త విశ్వం ఆ సమతుల్య  సంకల్పానికి అనుగుణంగా వ్యవహరిస్తాయి. ఇదే దైవత్వాన్ని పొందిన మహనీయుల మహిమలకు కారణం. వీరు దేశ కాలాలకు అతీతంగా ఉండి నిష్కామ కర్మ యోగంతో సంఘాన్ని, సమతుల్య ప్రయోగంతో సృష్టి స్థితి లయాలను అదుపులో ఉంచుతారు. సాధన ఫలించేవరకు ఉన్న వ్యక్తిత్వం శివ రూపం అయితే, ఫలించిన తరువాత అణిమాది అష్ట సిద్ధులతో సృష్టి స్థితి లయాలను సమతుల్యం చేసే వ్యక్తిత్వం విష్ణు రూపం. విష్ణు సమతుల్య క్రియలో జ్ఞానమే బ్రహ్మ సరస్వతులు. సమతుల్య క్రియా ఫలితమే లక్ష్మి. ఆ సమతుల్య సంకల్ప జ్ఞాన శాశ్వత శక్తి నిరంజన నిర్గుణ తత్వ మనుగడే శ్రీ లలిత. ఇటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన వివరణ సభాపతి శుద్ధ విద్య లోనూ,  దత్తాత్రేయ సంహిత మొదలైన గ్రంథాల్లో శుద్ధ విద్య, శ్రీ విద్య గా చెప్పబడింది. అవిద్య ను ఖండించే శుద్ధమైనదిగా, శ్రీ అనే సమతుల్య సంకల్ప జ్ఞాన స్థిర చైతన్య మనుగడ కలిగించే విద్య కనుక శ్రీ విద్య అన్నారు. ఈ విద్య బాలగా ( కుండలినీ జాగృత మొదటి స్థాయి ) మూలాధారంలో మొదలై సహస్రార ప్రయాణంలో పరా, పశ్యన్తి, మధ్యమ స్థితులను దాటి కాళి, సరస్వతి రూపాలతో ముఖాన్ని చేరి వైఖరి గా భావ ప్రకటన జరుగుతున్నది. ఆ భావం పరిసరాలను గమనించి భౌతిక, మానసిక సమతుల్య పరివర్తనతో లక్ష్మీ రూపాన్ని సంతరించుకొని సంపదలను ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ సమతుల్య స్థితి భౌతిక మానసిక అవసరాలను దాటి నిష్కామ ఆధ్యాత్మిక ప్రయాణం సహస్రారం వైపు చేస్తూ శ్రీలలితగా రూపాంతరం చెందుతుంది. ఈపరిణామం ఆయా జీవ శక్తుల పరిణామ పరిణతి జన్మ సిద్ధమై,  జ్ఞాన సాధనల తో వృద్ధి అవుతుంది. ధర్మ పరిణామానికి కర్మ అనుగుణమైనప్పుడు అది నిష్కామ కర్మగా మారి కర్మబంధ విముక్తులను చేస్తున్నది. ఇదే కాక తంత్ర శాస్త్రంలో 32 దీక్షా విధానాలున్న ( శుద్ధ విద్య,  బాల, ద్వాదశారాధ, మాతంగి… అనుత్తర మొదలైనవి ) శ్రీ విద్య ను కూడా ఆమె పలువరుస తో పోల్చవచ్చు. 

నా ! కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా ! కర్పూర తాంబూలంతో ఆమె నోటి నుండి  వెలువడుతున్న సువాసన అన్ని దిక్కులకు వ్యాపిస్తున్నది. ఆ శ్రీ లలిత నుండి వెలువడే శబ్ద స్పర్శ రూప రస గంధాలనే పంచ తన్మాత్రలను ఒకదాని తరువాత ఒకటి అవి ప్రకృతిలో చేస్తున్న సందడిని చెప్తున్నట్లుగా ఉంది. ఇంతవరకు రూపంలో ఉండే వెలుగులను చూపుతూ ఈ నామంలో  సువాసన గూర్చి చెప్తున్నారు. 

నా ! నిజసంలాప మాధుర్య వినిర్భర్శిత కచ్చపి ! సరస్వతీ కచ్చపి అనే వీణా వాద్యమే సిగ్గుపడుతుందా అన్నట్లు ఆమె మాటల మాధుర్యం ఉన్నది. “ఆమె గుణగణాలు పాడుతూ సరస్వతీ దేవి పలికిస్తున్న కచ్చపి శ్రీ లలిత మాటలు వినగానే మూగపోతూ తన శ్రుతిని మార్చుకొంటున్నదా అన్నట్లు ఉంది ” అని సౌందర్యలహరి 66 వ శ్లోకం చెప్తున్నది. 

నా ! మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసా ! అందమైన ఆమె చిరునవ్వు ఆ కామేశ్వరుని మనస్సును ఆక్రమిస్తున్నదా అన్నట్లు వుంది. ప్రకాశ రూపమైన కామేశ్వరుడు విమర్శ రూపమైన కామేశ్వరి చిరునవ్వుతో ఉత్తేజం పొంది ఐక్య రూప బిందువు వెలుగుతున్నదా అన్నట్లుంది. చంద్రకళ వంటి ఆమె నవ్వుతో ఆయనలోని అగ్ని కళ లేక కామకళ వెలుగుతున్నదా అన్నట్లుంది. సూర్యుడు కామ ( అగ్ని కళ ), కళలతో ( చంద్ర కళ ) బిందు రూపంలో వెలుగుతూ ఉంటాడు. అందునా సంధ్యా సమయాలలో అరుణ వర్ణంతో చూడగానే మనస్సు ఏకాగ్రతకు లోనవుతుంది. పాంచరాత్రం లో సౌరం లేక సూర్యారాధన ప్రాముఖ్యం ఇదే. అంటే ప్రకృతి యొక్క అన్ని దర్శనాల్లో తాదాత్మ్యం పొందడమే ఈ సాధన ఉద్దేశ్యం. ప్రకృతితో తాదాత్మ్యం దాని ప్రభావం శరీర తత్వానికి భిన్న ప్రభావం కాకుండా ఏకత్వాన్ని సిద్ధిస్తుంది. అంటే జీవితం ప్రతిక్షణం ప్రతి పనీ ఏక తత్వం పైనే నడుస్తుంది. ఈ సాధన, సాధకుడు, జ్ఞేయం యొక్క తాదాత్మ్యం చెప్పడానికే ఈ లలితా సహస్రనామ ఉదేశ్యం. వేదం లాగా ఈ నామాలు పలు అర్థాలను ఇస్తూ సాధకుని స్ధాయిని బట్టి అర్థం అవగత మౌతూ ఉంటాయి. ఇంతే గాక ఆ నామాలలోని సంక్లిష్ట పద బంధాలు ఏకాగ్రతకు సాధనమైతే, ప్రాకృతిక అర్థాలు మానసిక భావ ఆనందాన్ని, ఆధ్యాత్మిక అర్థాలు సాధనలో అనుభవైక  మార్గదర్శనాన్ని ఇస్తాయి. 

నా !  అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా ! పద్మినీ జాతి స్త్రీ అయిన లక్ష్మీ దేవి కొలువై ఉన్న  ఉన్న ఆ లలిత చుబుకం యొక్క సౌకుమార్యం దేనితోనూ పోల్చడానికి వీలు లేకుండా ఉంది. సర్వం సంతులిత సమన్వయ సమీకృత సృష్టి సౌందర్యం ఉన్న లక్ష్మీ దేవిని చూడగానే ఎవరికైనా ఏకాగ్రతతో ఏ భావం లేని లేక అన్ని భావాలు ఒక్కసారిగా ఐక్య రూపంతో వెలువడుతాయి. శక్తితో, జ్ఞానంతో,  సంతులిత సంకల్పమై వెలుగుతున్న చండిక, సరస్వతి, లక్ష్మీ స్వరూపాల ఐక్య స్వరూపమే ఆ శ్రీ లలిత. అటువంటి జననిలో  ఏ దృశ్యం చూసినా అలౌకిక అనుభూతి కలుగుతుంది. శ్రీ లలితకు ఉన్న చంచల శక్తి, మాటలోని మాధుర్యం, లక్ష్మీ దేవి లోని లావణ్యం స్త్రీలలో కనపడుతున్నాయి కనుక ఆ శక్తి స్వరూపాన్ని స్త్రీ గా ఊహించారు. ఈ స్త్రీ సౌందర్య దృశ్యం పురుషులకు చూపిన అందమేనా అంటే కాదు. స్త్రీలకు ఏవిధంగా ఉంటే వారికి సాధన కుదిరి తామే శ్రీ లలితగా మారే అవకాశం ఇందులో ఉన్నది. పురుషుడు ఆ శ్రీ లలితను తల్లిగా చూసి ఐక్యం పొందాల్సి ఉంటుంది. కాని స్త్రీలు సహజంగా తామే ఆ రూప, వ్యక్తిత్వ ధారణతో శ్రీ లలితగా మారే అవకాశం ఉంది. అందుకే అగస్త్యుని ఇల్లాలైన లోపాముద్ర భర్తతో సమానంగా తాను కూడా శ్రీ విద్యను సాధన చేసి ప్రత్యేక పంచదశీ సాంప్రదాయానికి నాంది పలికింది. 

నా! కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరా ! కామేశ్వరుని మంగళ సూత్ర బంధంతో అలంకరించ బడ్డ  మెడతో ఆ శ్రీ లలిత ఉన్నది. ఇక్కడ ఈ మంగళసూత్ర ధారణ సనాతన హిందూ సాంప్రదాయం పాటించే స్త్రీలకు అతి సహజమైనా దీని అర్థం ఆధ్యాత్మికతలో వేరుగా ఉంటుంది. విశ్వశక్తిగా ఉన్న ఆ లలితా శక్తి పదార్థ రూపాంతరం చెందినప్పుడు తనకై తాను పదార్థంలో ( chemical bonding ) బంధించుకొంటుంది. బంధించబడిన శక్తి విడుదల కావాలంటే తిరిగి తానే ఆ పదార్థాన్ని భేదించాలి. నిర్జీవ పదార్థాన్ని తనవలన జీవం పోసి తిరిగి ఆ జీవానికి సత్ చిత్ ఆనందాన్ని కలుగ చేస్తున్నది. భారతీయ వివాహ వ్యవస్థ గమనిస్తే భార్య భర్తకు జీవిత కాలం కుటుంబ సంఘ జీవనానికి చుక్కానిగానే ఉంటున్నది. ఇరువురి మధ్య ఆ బంధమే ( భార్య ప్రేరణ లేక ఇఛ్చగా, భర్త జ్ఞాన క్రియగా – ఇప్పుడు వీటి నిష్పత్తులు మారి ఉండవచ్చు ) లేకుంటే సంతులిత నాగరిక సమాజ జీవితానికి ఆధారమైన వివాహమే ఉండదు. కనుక స్త్రీలోనైనా, పురుషునిలో అయిన ఆణువణువూ ఆవరించి ఉన్నది ఆ పరాశక్తి చైతన్యమే. ఈ నామాల్లో కొన్ని భౌతికంగా వారి మధ్య అన్యోన్యతను సూచిస్తున్నాయే కాని ఆ మూల శక్తి స్త్రీ కాదు, పురుషుడు కాదు. స్త్రీ అయినా పురుషుడు అయినా తమ అంతరంగంలో జ్యోతి స్వరూపాన్ని సాధనతో దర్శించాల్సిందే. లేక ఇద్దరిలో ఒకరి సాధనా ఫలంలో మరొకరు తరించాల్సిందే. అలాగని జీవితానికి, తత్వానికి వివాహం అవసరామా అనే ఈ నాటి యువత ఆలోచించాల్సింది బాల్యంలోనే మనసా, వాచా కర్మణా బ్రహ్మచర్యం అవలంబించిన సనక సనందనాదుల లాగా, ఆది శంకరుని లాగ ఉండగలిగితే ఆధ్యాత్మిక సాధన అలవడుతుంది. అలా కాకుండా క్రమ శిక్షణతో, సాంఘిక నియమాలతో శరీరాన్ని వివాహ వ్యవస్థ ద్వారా అదుపుచేయని వారికి (స్త్రీ పురుషులు ఇరువురికీ ) అసుర పశు ప్రవృత్తి మాత్రమే కర్మ బంధమై మిగులుతుంది. ఆధ్యాత్మిక, దివ్య, మానవ తత్వం సన్నగిల్లి తిరిగి ఆటవిక సమాజానికి నాంది అవుతుంది. ఈ వివాహ బంధంలో ఎవరు ఎక్కువ అన్నది ఆ ప్రయాణంలో ఎవరు శక్తివంతులై మరొకరికి మార్గదర్శనం చేస్తారు  అన్నదే నిర్ణయిస్తుంది కాని ఇది ఒకరిపైఒకరి పెత్తనంతో కాదు. జ్ఞాన సాధనలు లేకుండా సామాజిక, దివ్య, ఆధ్యాత్మిక జీవిత పరిణతి అసాధ్యం. ఆ అలౌకిక అనుబంధం చెప్పడమే ఈ నామం ఉద్దేశ్యం. యద్భావం తద్భవతి. 

నా ! కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా ! కేయూర మణులతో కూర్చబడిన కనకాభరణలతో ఆమె భుజం కీర్తులు కమనీయంగా అంటే చూడడానికి అందంగా ఉన్నాయి. అందుకే దేవీ దేవతల అలంకారంలో ప్రతి అవయవానికి ప్రత్యేక ఆభరణాలు ఉంటాయి. 

నా! రత్నగ్రైవేయ చింతా కల్లోల ముక్తా ఫలాన్వితాః ! చింతామణి వంటి అనేక రత్నాలతో మెరుస్తున్న కంఠాభరణం కలిగి ఉన్న ఓ దేవీ! ఇంకో రకంగా తీసుకొంటే సమస్త రత్నాభరణాల లేక బాహ్య సుఖ చింతనల ఫలాల నుండి విముక్తి కలిగించి ( నిష్కామ కర్మ ) ఆధ్యాత్మికంగా ఉన్నతికి తీసుకుపోయేది అని అర్థం. చింత లో ఉన్న జ్ఞానాన్ని బంధ( లోల )విముక్తం చేసేది అని అర్థం. నిష్కామ కర్మ యోగం వైపు ( ముక్తా ఫలాన్వితా ) నడిపి ముక్తులను ( జన్మ జరా దుఃఖ మరణాల నుండి )చేసేది. 

బాహ్యంగా ఈ అద్భుత సౌందర్య రాశిని ప్రకృతిలో ఉన్న అందాలను పోలుస్తూ పూజిస్తే మనసు తన్మయత్వం చెంది తనలో తాను చూసుకోవడం మొదలు పెడుతుంది. ఇదే హిందూ మత పూజలు బహుళంగా ఉండడానికి కారణం. అనంతమైన ఆ ప్రకృతి శక్తిని ఆరాధించడానికి పరిమితి కాని అవధులు కాని లేవు. ఎక్కడ, ఏ వ్యక్తిత్వానికి, ఏ చిత్రపటానికి, విగ్రహానికి పూజ చేస్తే మనస్సు సంయమనం చెంది చిత్తం ప్రశాంత స్థితికి వస్తుందో అది చేయవచ్చు. కాని క్రమేణా ఆ ప్రశాంత చిత్త స్థితిని అంతర్యాగం అంటే తన లోపల ఉన్న ఆ బాహ్య శక్తి చైతన్యాన్ని గమనించడం ప్రారంభించాలి. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ( 3.30 నుండి 4.30 వరకు )సుషుప్తి నుండి మేల్కొన్న చిత్తం ఎటువంటి అలజడి లేకుండా సుధా సాగర మధ్యంలో ఉన్నట్లు ప్రశాంతంగా కుండలిని అధీనంలో ఉంటుంది. అప్పుడు ఆ సాగర మధ్యంలో చింతామణి గృహంలో మేరువు పై ఆసీనమై కామాక్షి గా కామ దాయినిగా ఉన్న ఆ పరాశక్తి శుద్ధ స్థిర చైతన్యపై జ్ఞాన సంతులిత మనుగడను సంకల్పంతో కేంద్రీకరించాలి. ఇదే ధారణ ధ్యానాల ఏకీకృతం. అక్కడ స్థిరమైన ప్రశాంత సంకల్ప చిత్తం దినమంతా ఉంటుంది. అప్పుడు అనుకొన్న పనులు అవలీలగా జరుగుతాయి. ఇదే సంకల్ప సిద్ధి. ఏకాగ్రతను  మూలాధారం పై లేక కంటిపై ఉంచితే అధమ సాధకులు, అనాహతం పై లేక హృదయంపై ఉంచితే మధ్యమ సాధకులు, ఆజ్ఞ లేక భ్రూమధ్యం పై ఉంచితే ఉత్తమ సాధకులు, సహస్రారం పై ఉంచితే యోగులు అవుతారు. కనుక క్రింది స్థాయిలను ఆయా శరీర అవసరాలకు మాత్రం ఉపయోగించి ఊర్ధ్వ ముఖంగా ప్రయాణం చేస్తూ నిరంతరం సహస్రార ధారణ ధ్యాన అనుభవాలను ఏకీకృతం చేయాలి. ఇక్కడ ఆ తల్లి ప్రమేయం ఏమీ ఉండదు. కర్మ ఫలానుసారంగా ఆ శక్తిని సంకల్పంతో ఎక్కడ కేంద్రీకరిస్తే అక్కడ ఆయా ఫలితాలను ఇస్తున్నది. మానవుల సుఖ దుఃఖాలు, దేవతల స్వర్గ నరకాలకు కారణమిదే. 

నా ! కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపన స్తనీ ! కామేశ్వరుడు అనే ఆవరించిన పదార్థ స్థితి కోరిన కోరికలు తీర్చే అమృత కళాశాలుగా ( ఆకలి,  కామం,  మొహం  తో మూలాధారం నుండి చూసే వారికి ) ఉన్నాయి. బాహ్య సుఖమయ చక్రాల అస్తిత్వం తో చూస్తే శ్రీ చక్ర  త్రికోణ ఊర్ధ్వ  భాగంలో ( బాహ్యంగా ఉన్న శివ శక్తి చక్రాలతో చూస్తే ) ఉన్న కామ కళ కనబడుతుంది. ఇదే కామకళను త్రికోణ మధ్యంలో ఉన్న బిందువుపై ( సుమేరు మధ్య శృంగస్థా ) కేంద్రీకరిస్తే అనంత శక్తిలో జ్ఞాన సంతులిత  సంకల్ప శక్తి ఆవిష్కృత మవుతుంది. దృష్టిని బట్టి భావం, ఆలోచన, అనుకరణ, కర్మ, ఫలితాలు ఉంటాయి.

నా! నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయీ ! లక్ష్య రోమలతా ధారతా సమున్నేయ మాధ్యమా ! నాభి నుంచి బయలు దేరిన లతకు కాసిన కాయలలాగా స్తన ద్వయం కలిగిన ఆ శ్రీ లలిత మధ్య భాగం సమున్నతముగా కనబడుతున్నది . 

శరీరంలో అణువణువూ ఆవరించి షట్చక్రాలలో కేంద్రీకృతమై ఉన్న ఆ దేవిని ఆరాధించడానికి నవ విధ భక్తి రీతులున్నాయి. తల్లిగా ఆరాధిస్తే నిస్వార్థ సహాయం చేస్తుంది. చెల్లిగా ఆరాధిస్తే జీవిత కాలం అభిమానంగా చూస్తుంది. భార్యగా ప్రేమిస్తే నిత్య జీవితములో తోడుంటుంది.  

అలాగే మూలాధార శక్తిని ఆరాధిస్తే భౌతిక అవసరాలకు , అనాహతంలో మానసిక సాంఘిక అనుబంధాలకు , ఆజ్ఞలో ఆరాధిస్తే జ్ఞానానికి , సహస్రారంలో నిలబెడితే ముక్తికి సహకరిస్తుంది. కనుక ఆమె సౌందర్యారాధన లో వచ్చే రక్తి , భుక్తి , ముక్తి సాధకుని స్థాయిని బట్టి ఉండి ఆయా ఫలితాలను ఇస్తాయి.

పై నామం ఆధ్యాత్మిక స్థాయిలో చూస్తే నాభి సంవిద్ బిందువుగా ఉన్న సాధకుడు పైన త్రికోణం  లో ఉన్న ప్రకాశ విమర్శ బిందువులుగా ఉంటాయి . ఇదే సౌందర్య లహరిలో (౩౩ వ శ్లోకం ) “ శరీరం శమ్భో శశి మిహిర వక్షోరుహాయుగం “ అనే శ్లోకంలో భూమి పై నుండి నేను చూస్తున్న సూర్య చంద్రుల లాగ ఉన్నాయి తల్లీ ని వక్ష ద్వయం అంటారు ఆది శంకరులు . 

నా ! స్తన భార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా ! ఉన్నతంగా ఉన్న స్తనాల భారంతో వంగి ఉన్న ఆమె నడుము పైన ముడుతలు వడ్డాణం అలంకరించినట్లుగా ఉన్నాయి. ప్రకాశ విమర్శ అంశాలైన ఆ రెండు స్థానాలు గుణత్రయం గా నడుము ముడుతల పై భారంగా ఉన్నాయా అనిపిస్తున్నది. ప్రకాశ విమర్శలు రెండూ కలిసి మధ్య నున్న నాభి లో సంవిద్ బిందువై ఆ తరువాత క్రింద నున్న కటి భాగంలో ( మూలాధారంలో ) త్రిగుణాత్మకమైన వ్యష్టి బిందువుగా మారుతున్నది. 

నా ! అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్త్వత్ కటితటీ ! కుంకుమ పువ్వు, బంగారు వర్ణం కలిసిన అరుణ లేక ఎరుపు రంగుతో ఉన్న ఆమె వస్త్రం కటిభాగాన్ని కప్పుతూ ఉన్నది. అరుణ వర్ణం కోరికకు చిహ్నం. కటిలో అప్పుడే మొదలైన వ్యష్టి బిందువు తన కోరికలతో ఎరుపు వర్ణం సంతరించు కొన్నట్లుగా ఉన్నది. 

నా ! రత్న కింకిణికా రమ్య రషణా దామ భూషితా !.రత్నాలతో పొదిగిన వడ్డాణం నడుముకు ధరించి అత్యంత రమణీయంగా ఉన్నది. కటి, నాభి స్థానంలో వెలువడే కోరికలనే గుర్రాలకు అడ్డుకట్ట వేస్తున్నట్లుగా వడ్డాణం ఉన్నది. 

నా ! కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా ! అతి మార్దవంగా ఉన్న స్త్రీసౌభాగ్యమైన ఊర్ద్వయం గూర్చి ఆ కామేశ్వరునికే తెలుసు అన్నట్లుగా ఉన్నాయి. పతివ్రతా స్త్రీ ఊరువుల గూర్చి ఆమె భర్తకే తెలుస్తాయి కనుక వాటి నునుపు గూర్చి ఇతరులు ఊహించడం కష్టం. సంక్లిష్టమైన వ్యష్టి బిందువు కలిగిన కటి స్థానాన్ని మోస్తూ శరీరం సమతుల్యం చేయడానికి ఉన్న ఊరువుల శక్తి సరిపోతుందా అన్నట్లుగా ఉన్నాయి. అంతే గాక ఆ వ్యష్టి భారాన్ని తీర్చడానికి కామేశ్వరుని అవసరం ఉన్నట్లుగా ఉన్నాయి. 

నా ! మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా ! రెండు మాణిక్యాలుగా మెరుస్తూ ఆమె మోకాటి చిప్పలు ఉన్నాయి. పై ప్రకృతి లేక స్త్రీ లేక లలిత అందాలను త్రిగుణాలతో చూస్తే ద్వయాత్మక సృష్టి అత్యంత మనోహరంగా కనపడుతూ ఉన్నది. లలిత వ్యష్టి రూపమైన ( చైతన్య శక్తి )ప్రకృతిలోని అందాలన్నీ కామేశ్వర రూపమైన పురుషుని (స్థితి శక్తి లేక ధ్యాన నిమగ్నుడైన శివుని )ఆకర్షించడానికి స్త్రీలో పొందుపర్చబడినట్లుగా ఉన్నవి. నిరంతరం ధ్యానం భంగం అయిన స్థితి శక్తి ఆ అంతర్గత చైతన్య శక్తికి లోబడి రూపాంతరం చెందుతూ జీవునికి మాయను లేక భ్రమను కలిగిస్తూ ఉంది. 

నా! ఇంద్రగోప పరిక్షిప్తస్మర తూణాభ జంఘికా! మన్మధునికి ఇష్టమైన పుష్యరాగ కాంతులతో ఆమె జంఘాలు మెరుస్తూ ఉన్నాయి. పురుషునికి అందమైన పద్మినీ జాతి స్త్రీలోని ప్రతి అవయవము అద్భుతంగానే కనబడి ఆయా వయో గుణ స్థాయి ప్రభావంతో ఉత్తేజం, ప్రేరణ ( తమోగుణంతో కామం,  రజో గుణంతో ప్రేమ, సత్వ గుణంతో మమేకం ) కలిగిస్తూనే ఉంటాయి. బిందు రూపంలో వ్యక్తమైన ఆ విశ్వేశ్వర వ్యష్టి రూపంతో ప్రకృతిగా ఆ ప్రకృతికి  ప్రతినిధిగా అందంతో ఉన్న స్త్రీ రూపంలో పోలుస్తున్నారు. పురుషునిగా పదార్థ రూపమైన కామేశ్వరునిగా పోల్చారు. ఈ ఇరువురి సంగమ ఫలితమే ఈ సృష్టి అని చెప్పడం ఉద్దేశ్యం. 

నా! గూఢ గుల్ఫా ! ఆ పాదాల వెనుక దాగి చీలమండలు నా! కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్వితా ! తాబేటి చిప్పల కఠినత్వాన్ని తలదన్నుతూ ఉన్నాయి. 

నా! నఖ దీధితి సంఛన్నమజ్జన తమోగుణా ! పదద్వయ ప్రభాజాల పరాకృత శిరోరుహా ! శింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజా! మరాళీ మందగమనా మహాలావణ్యశేవధీ !! తమస్సుతో కూడిన అంధకారాన్ని చీలుస్తూ కాంతివంతంగా ఉన్న కాలి గోళ్ళతో, వెలుగుతున్న సరస్సులోని పద్మాలను సిగ్గు పడేటట్లు చేస్తూ మణి మంజీరాలు కదులుతూ ఉన్న పాదద్వయం తో హంసలాగా అత్యంత లావణ్యంతో మందగమన అయి వస్తున్నది. స్త్రీ పాదాలను చూస్తే భక్తి గౌరవం, పై భాగాలను చూస్తే కామం మొహం కలగడం సహజం. అందుకే ఆమె పాదాలు తమోగుణాన్ని పోగొట్టే వెలుగులతో ఉన్నాయి. నారదుడు పార్వతీ దేవి తల్లితో మాట్లాడుతూ ” ఓ మైనావతీ ! పైకి లేచి ఉన్న ఆ హస్తాల సంకేతం ఏమిటంటే నీ పుత్రిక కు భర్తగా ఉండగలిగినవాడు ఇంకా జన్మించలేదు” అంటాడు. దానికి హిమవంతుడు  బాధపడుతుంటే తిరిగి నారదుడు ” దీనర్థం జగజ్జనని కాబోతున్న ఈ బాలికను పుట్టుకయే లేని ఆ పరమశివుడే భర్తగా వస్తాడు అని చెప్తాడు. 

నా! సర్వారుణ అనవద్య అంగీ సర్వాభరణభూషితా ! అరుణ రంగులో ఆమె సర్వ అవయవాలు  వాటికి అలంకరించిన స్వర్ణాభరణాలతో పోటీ పడుతూ ఉన్నాయి. అరుణ వర్ణంలో ఉన్న స్త్రీలకు బంగారు రంగు మరింత మెరుపును ఇస్తుంది. ఆమె భౌతిక స్వరూపం నుండి ఇప్పుడు ఆ లలితా దేవి స్థానము ఈ బ్రహ్మాండంలో,  శరీరంలో ఎక్కడ ఉన్నది అని వచ్చే శ్లోకాలలో చెప్తున్నారు. బ్రహ్మాండం గా కనబడుతున్న నిర్జీవ  పదార్ధం అండమై,  పిండమై, జీవంగా ఆ పరాశక్తి చేతన వల్లనే జరుగుతున్నది. కనుక శరీరంలో ఆమె స్థానాన్ని సమాజంలో స్త్రీగా బ్రహ్మాండంలో ప్రకృతిగా పోలుస్తారు. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.