Sri Vidya – The Eternal Energy Code Part 3

శివ శక్తుల సమన్వయం :

నా! శివా కామేశ్వరాంకస్థా శివస్వాధీన వల్లభా ! శివుని ఎడమ అంకంపై కూర్చున్న శివాని తన నాథుణ్ణి స్వాధీనం చేసుకొంటున్నది. అత్యంత రసమయమైన ఈ పతీ పత్నుల  భంగిమ పురుషుని స్త్రీ కి స్వాధీనం చేయకుండా ఉంటుందా! ఇక్కడ అంతరార్థం పదార్థ స్థితి స్వరూపమైన ఆ పరమశివుని అంతర్గతంలో అణు శక్తిగా ఉన్న ఆ చైతన్య శక్తి పదార్థాన్ని స్వాధీనం చేసుకొని తన ఇచ్ఛానుసారం ఆయనను పరిణామ రూపాంతరానికి లోను చేస్తున్నది అని అర్థం. అంతే గానీ అందరికీ తెలిసిన అత్యంత సహజమైన స్త్రీ పురుష భంగిమ గూర్చి నారాయణ స్వరూపమైన హయగ్రీవుడు చెప్పాల్సిన పని లేదు మహర్షి అయిన అగస్త్యుడు వినాల్సిన పని లేదు. సంస్కృతంలో ప్రతి పదానికి ఉన్న ప్రతి పదార్థాల లేక భావ సారూప్యతను ఆధారంగా జరిగిన ఉపదేశం ఇది. అంతే గాక నారాయణుడు నర రూపానికి వివరించిన శక్తి రూపం. నరునికి గుణాధిపత్యంతో ఆయా స్త్రీ,  దివ్య, ఆధ్యాత్మిక  రూపాలు గా పరాశక్తి కనబడుతుంది .ఈశ్వరుడైన పదార్థంలో చైతన్యాన్ని లేక కామాన్ని లేక ఇచ్ఛను ( కామ రూపుడైన మన్మధుని రూపం ) కలిగించి అనేక రూపాలలో కామేశ్వరున్ని రూపాంతరం చేస్తున్నది. సత్వ రూపంగా ఉన్న ఈశ్వరుడు చిత్ లేక చైతన్యంతో ప్రభావితం అవుతున్నాడు. ఈ చిత్ వినడం, చూడడం, అర్థం చేసుకోవడం, చదవడం, గుర్తు పెట్టుకోవడం, ఆలోచించడం, సమీకృతం చేయడం, నిర్ణయించడం, ఊహా చిత్రాన్ని చేయడం, ప్రేమించడం, కామించడం అన్నీ కలిసి సమ్యజ్ఞానమై పని చేస్తున్నది అని ఐతరేయ ఉపనిషత్ చెప్తున్నది. అదే ఉపనిషత్ అన్ని జ్ఞానాలకు మూలమైన ప్రజ్ఞానాన్ని శివుడు అంటున్నది. బ్రహదారణ్యకోపనిషత్  ముందు ఏకంగా ఉన్న శివత్వం అనేకం కావాలని కోరింది( కామ ) అంటున్నది. ఇదే శక్తి అంతర్లీనమై ఉన్న పదార్థ రూప కామేశ్వరుడు. ఆ పరాశక్తి పరమాణు శక్తిగా అంతర్గతంగా సమిష్టిగా ఈశ్వరునిలో ఉండి చైతన్యంతో కామాన్ని (కదలికను ) పుట్టించి సృష్టిగా రూపాంతరం చెందించినది. 

అసంతులిత  సమిష్టి శక్తి అసంకల్పితంగా వ్యష్టి గా, ఆత్మగా,  బుద్ధిగా మారి శరీరంలో ప్రవెశించింది. బుద్ధి తన నాడీ సంచాలనంతో ఇంద్రియాలకు ( జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ) ప్రేరణ కలిగిస్తున్నది. ఇంద్రియ చలనానికి అవసరమైన శక్తి ప్రాణ రూపంలో ( ఆమ్లజని సరఫరాతో కణాలకు ) చైతన్యం అందచేస్తున్నది. బుద్ధి, ప్రాణాలకు మధ్య ఉన్న చైతన్యం ఇంద్రియ ప్రభావితమై మనస్సుగా ఉంటున్నది. మనస్సు అధీనంలో కర్మేంద్రియాలు వాటికి ఆధారమైన శరీరం ఉంటున్నాయి. ఈ చైతన్యం, బుద్ధి మనస్సు ఇచ్ఛా జ్ఞాన క్రియల  పరిణతి ఆధారంగా సంఘ, ప్రకృతి లో జీవ మనుగడ సాగుతున్నది. కామం అస్థిరమైన చైతన్య భ్రమణానికి అసంతులిత అసంకల్పిత ఫలితం. కామాన్ని వశం చేసుకున్నవాడు ( వాసనకు మూలమైన చైతన్య గమనాన్ని బుద్ధితో సాక్షిగా గమనిస్తున్నవాడు -శైవాగమాలు) శివుడు. కామానికి వశమైనవాడు నరుడు. ఈ రెండింటిని సంయమనం చేసుకొన్న వారు దేవతలు. శివుని స్థిరత్వమే చైతన్యానికి ఆనందం. శివ శక్తుల సంయమన సంతులిత సంకల్ప రూపమే సద్వస్తు ప్రతిరూపమైన ఆత్మ లేక జీవుడు. శక్తి ఇచ్చగా శివుడు రూపు దిద్దుకొంటున్నాడు. సమస్తాన్ని కలిగినవాడు, శి మంచిని వ కలిగినవాడు,  సమ్యతి లేక శాంతాన్ని కలిగినవాడు శివుడు. ఈ లక్షణాలన్నీ పదార్థ రూపంగా స్థిరమై ఉన్న శివుడిని సూచిస్తున్నాయి. అందుకే శివుడు దేవతలకు, అసురులకు పక్షపాత రహితంగా వారి ఏకాగ్రతా సిద్ధి ఆధారంగా ఫలితాలు ఇస్తుంటాడు. శివునిలో చైతన్య పరిణతే మానవుని వృద్ధికి ఆధారం. 

శ్వేతాశ్వరోపనిషత్ ” ఎవరి మూలంగా స్త్రీలు గర్భం దాలుస్తున్నారో ఎవరి గర్భమే తనై ఉంటున్నాడో అతడే శివుడు ” అంటున్నది. సూత సంహితలో “( VI:13:2-41) ఎవరు మాయలో చైతన్యంగా ఉండి చిన్మాత్రను లేక ఆత్మతో కలిసి ఉన్నారో, ఎవరు బుద్ధిగా స్వయంశక్తిగా, గుణరూపాలను శాసిస్తూ శాశ్వత తత్వంగా ఉన్నారో శివానిగా ఉన్న  ఆ పరాశక్తియే సంసార మాయను ఛేదించగలదు. ఆగమాలు “అగ్నికి వేడిగా, సూర్యునికి కాంతిగా, చంద్రునికి చల్లదనంగా శివునికి శక్తి ఉంటున్నది”అంటున్నాయి. తానే సృష్టించిన తన రూపాంతరమైన శివుని ఆ పరాశక్తి స్వాధీనం చేసుకొని శాసించడంలో అతిశయం ఏముంది. కాళికా పురాణంలో చెప్పినట్లు ఆ శక్తి మధ్యన ఉండి తన చుట్టూ ఉన్న శివత్వాన్ని శాసిస్తున్నది. ఆ శక్తి ద్వారానే శివుడు అందరికీ ఆనందాన్ని ( భుక్తి,  ముక్తి ద్వారా )ఇస్తున్నాడు అని ఆగమాలు అంటున్నాయి. ఆ శివుడు విశ్వమైతే ఆయన శక్తి ఆమెనే అని సూతసంహిత చెప్తున్నది. ఆ శక్తి ఉంటేనే శివుడు సృష్టి చేస్తున్నాడని లేకపోతే తాను కూడా కదలలేడని సౌందర్యలహరిలో ఆదిశంకరుడు చెప్తున్నాడు. వీటన్నిటి భావం ఇప్పటి శాస్త్రజ్ఞులు చెప్తున్న పదార్ధం అందులోని అణు పరమాణు రూపంలో ఉన్న శక్తి స్వరూపం అనేది స్పష్టం అవుతున్నది. ఇప్పుడు ఆమె పదార్థ రూపమైన శివునిలో చైతన్యంగా ఎక్కడ ఉంటున్నది అని శ్రీ చక్ర ఆధారంగా సహస్రనామంలో ఈ క్రింద శ్లోకాలు వివరిస్తున్నాయి. 

శుద్ధ పరాశక్తి అయిన శ్రీ లలిత అండ పిండ బ్రహ్మాండ స్థానం:

నా ! సుమేరు మధ్య శృంగస్థా శ్రీమన్నగర నాయికా ! చింతామణిగృహాంతస్థా పంచబ్రహ్మాసన స్థితా ! మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ ! సుధాసాగర మధ్యస్థా కామాక్షీ కామదాయినీ !!

సుధా సాగర ( అమృతంతో నిండి ఉన్న సాగర మధ్యలో మహా పద్మాలతో ఉన్న అడవి మధ్యలో మేరు పర్వత శిరో భాగంలో ( మూలాధారం నుండి సహస్రారం వరకు వ్యాపించిన మేరు దండం లేక సుషుమ్న లేక వెన్ను పూస పైన ) సహస్రార పద్మ కర్ణికా మధ్య భాగంలో శ్రీనగరాన్ని ( అందమైన సిరులతో నిండియున్న శ్రీ విద్యను ప్రసాదించే నగరంలో లేక శ్రీ మేరు చక్ర రూపమైన శరీర మధ్యనున్న సుషుమ్న  ( విద్యారణ్య భాష్యం)  ) పాలించే ఓ నాయికా ! నీవు చింతామణులతో అలంకరించబడ్డ గృహాంతర్భాగంలో పంచ బ్రహ్మలు ( సదాశివుడు మంచె గా, బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు ఆధారమై ఉన్న మంచం పైన ) ఆధారమైన ఆసనంలో ఆసీన మై ఉన్నావు. కామాక్షిగా ( అందమైన కనుబొమలు కలిగిన చూపులతో లేక కోరిన కోర్కెలు తీర్చగలిగిన చూపులతో ) కామదాయినిగా, కామాఖ్య గా కోరుకొన్న వారికి స్థాయి బట్టి ( అరిషడ్వర్గ ప్రభావం లో ఉన్నవారికి, దివ్య, ఆధ్యాత్మిక స్థాయి వారికి ) వారి కోరికలు తీరుస్తున్నావు. ఇదే యోగ శక్తి తీవ్ర మైనప్పుడు కామం,  క్రోధం  ప్రకోపించి పతనమైన విశ్వామిత్రుడు, దుర్వాసుడు వంటి పురాణ మహర్షుల లేక నేటి సమాజంలో పతనమైన వామాచార సాధకులు,  రజనీష్, రామా లాంటి సాధకుల పతనానికి కారణం. యోగ సాధన చేసేవారు వారి అరిషడ్వర్గ  ప్రవృత్తిలో పరిణామం తీసుకు రాలేక పొతే అసురులకు దివ్య శక్తులు వచ్చినట్లు వారి పతనం నిశ్చయం అవుతున్నది. అందుకే సాధించిన శక్తి చైతన్యాన్ని ముందు అరిషడ్వర్గ పరిణామానికి ప్రాణాన్ని, బుద్ధిని ఉపయోగించి ధర్మ కర్మ మార్గంలో వాటిని దగ్ధ స్థితికి (నియంత్రణతో కాకుండా ధర్మ కర్మ అనుభవంతో సహజ పద్ధతిలో ) చేర్చాలి. అప్పుడవి జ్ఞానంలో అంతర్లీనమై తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. మనిషి శరీర గృహాంతర్భాగమైన హృదయం దాటి సహస్రారం ప్రవేశించనిదే ఆ శక్తి స్వరూపం స్త్రీ గా పురుషుని కామ మోహ ప్రభావాలకు గురి చేస్తూనే ఉంటుంది. ఈ ప్రభావం మనుష్యులలోనూ,  సాధనతో దైవాలుగా మారిన వారిలో కూడా ఉంటుంది. బ్రహ్మకు ఇచ్ఛను, కామేశ్వరునికి కోరికను, మానవునిలో కామాన్ని కలిగించేది, మన్మధ రూపమైన ఆ కామాన్ని మూడో కన్ను తెరిచి లేక జ్ఞాన నేత్రంతో ఆ శరీరం పై ప్రీతి అనే మాయను భస్మం చేయగలిగేది ఆ లలితనే. అది మానవుని చేతిలో  రెండు వైపులా పదునున్న కత్తి. ఎవరి స్థాయి కొద్దీ వారు తమ ఉత్తాన పతనాలకు ఆ లలితా శక్తిని ఉపయోగిస్తున్నారు లేక పరిణామ రహితులై జీవనం గడుపుతున్నారు. పరిభాష లలితా వ్యాఖ్యానంలో ఈ కామేశ్వర కామేశ్వరీ శక్తుల ఉత్థాన క్రియలను సహస్రనామాలలో 64 వ శ్లోకం నుండి 127 వ నామం వరకు వర్ణించారు. 

ఇక్కడ లలితా స్తవరత్నం, రుద్రయామళం వంటి శాక్తేయ గ్రంధాలు ఈ స్థితిని, ప్రదేశాన్ని ఎంతో అలంకారయుతంగా వర్ణిస్తూ  అనేక యోజనాల దూరం ఉన్న అడవి మధ్య పటిష్ఠమైన అనేక ప్రహరీలు కలిగిన నగర మధ్యంలో బంగారుతో చేయబడి మణులతో మెరుస్తున్న చింతామణి గృహంలో లేక శ్రీ పురంలో వసించి పాలిస్తున్న నగర నాయకి గా చెప్తున్నారు. కాని నిజానికి విద్యుత్ తేజ సమన్వితమైన ఆ పరాశక్తి లలితగా బ్రహ్మ రంధ్రం నుండి శరీరంలో ప్రవేశించి సుషుమ్న అనే వెన్ను నాడి గుండా ప్రయాణించి ( శరీర నఖ శిఖ పర్యంతం ఉన్న అవయవాలను చైతన్యం చేయడానికి ) ఆజ్ఞ, విశుద్ధి,  అనాహత,  మణిపూర,  స్వాధిష్టాన చక్రాలను వేగంగా దాటుకుంటూ వచ్చి బాలా త్రిపుర సుందరిగా గా మూలాధార చక్రం లో చేరి సుషుప్తిలో (ఆ శక్తి అంతా ఒక్క చోటే జాగృతమై ఉంటే ప్రమాదం కనుక క్రమ పరిణతి కొరకు చూస్తూ మూల జీవ క్రియలకు ఉపయోగ పడుతూ )అలవోకగా శయనిస్తున్నది. ఇదే ఈ నామాల సశాస్త్రీయ దివ్య ఆధ్యాత్మిక అర్థం. 

ఆ సహస్రారంలో ఆ పరాశక్తి తత్వాన్ని చేరి నిరంతరం ఆ శక్తిని పూర్ణ అనుభవంతో తన స్థిర శక్తితో ఆ చైతన్యాన్ని ధరిస్తూ భరిస్తూ సంతులితం చేసేవాడు సమస్త పదార్థ రూపమైన సదాశివుడు. ఆ సదాశివుని తరువాత ఆ అంశలో జీవ శరీర నిర్మాణంలో కొద్ది భాగం  తనలో ఉన్న జీవ శక్తిగా ఉన్న పరాశక్తిని నిరంతర సంతులితం చేస్తున్న ఇచ్చా రూపమైన పదార్ధం లేక జీవుడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని లోని ఇచ్ఛకు జ్ఞాన రూపమై ప్రకృతిని శరీరంతో మమేకం చేసే స్పృహ ఉన్నవాడు బ్రహ్మ,  ఆ ఇచ్చా జ్ఞానాలను జీవపరిణతికి ఉపయోగిస్తూ పదార్థ రూపాన్ని, ప్రకృతిని శాసించేవాడు ఆ ఈశ్వరుని  క్రియారూపమైన తత్వం విష్ణువు. ఆ జీవ తత్వంలో శక్తి క్షీణించి తిరిగి చైతన్య రహితమైన నిర్జీవ పదార్ధం గా మరణంతో తీసుకుపోయేవాడు రుద్రుడు. ఈ నలుగురూ పదార్థ రూపంలో దృశ్య ప్రపంచంగా కనబడుతూ ఆ శక్తిని ధరించి ( పరమాణు శక్తి తత్వంగా )  క్రమంగా శక్తిని జాగృతం చేసుకొంటూ ఉన్న సదాశివుని పరిణామ దశలే. 

మూర్ధ భాగం నుండి ప్రవేశించినప్పుడు ఆ శక్తి సదాశివుడైన పదార్థ ప్రమేయం లేకుండా తాను జీవ శరీరంలో స్థిరంగా ఉండగలిగిన మూలాధారంలోనికి  వేగంగా ప్రవేశించి అత్యంత శక్తివంతంగా ఉంటుంది. అందుకే మూలాధారం ఆ శక్తిని సుషుప్తిలో ఉంచుతుంది. మూలాధారంలో సుషుప్తి గా ఉండడానికి కారణం అక్కడ జీవ చైతన్యం జ్ఞాన రహితమై జీవ క్రియలకు మాత్రమే పరిమితమై ఉంటున్నది.  ఈ శక్తిని మూడు చుట్టలతో ఉన్న కుండలి గా ఎందుకు అన్నారంటే మానవ శరీరంలో నాడీ చలనం ( pulse ) గానీ,  ప్రకృతిలో శక్తి రూపాలైన కాంతి,  నాదాల చలనం తరంగం ( wave )వాటి దైర్ఘ్యం ( wavelength ) ఆధారంగా తమ చైతన్యాన్ని కలిగి ఉంటున్నాయి కనుక ఆ శక్తిని సర్పిలాకార కుండలినిగా తంత్ర శాస్త్రం చెప్తున్నది. 

ఆ జీవ శక్తి తరంగ దైర్ఘ్యంతో  చలింప చేసే ప్రాణం పై ఆధార పడి ఉంటుంది. ఆ ప్రాణం సాధారణ మానవులలో దీర్గంగానూ, యోగులలో హ్రస్వంగానూ ఉంటున్నది. నియమిత అష్టాంగ యోగ మార్గంలో ప్రయాణించే వారు ప్రాణాయామంతో ప్రాణాన్ని హ్రస్వ స్థాయికి,  ఆ పైన కుంభక కేవల కుంభకంతో అతి సూక్ష్మ స్థాయికి తీసుకుపోయి క్రమంగా స్తంభింప చేస్తారు. ఈ స్థాయిలో శక్తి ప్రాణంతో సంబంధం మెల్లగా విడిపోతూ చివరకు ప్రాణ స్తంభనంలో శుద్ధ చైతన్య శక్తిగా మారి సాధకులకు కుండలినీ జాగృత అనుభవం గా ( మూలాధారంలో కాని లేక సుషుమ్న లో పైన నాడీ చక్రాలు లేక సంధులలో గానీ  శక్తి చలిస్తున్న అనుభవం కలుగుతుంది. ఇదే కుండలినీ జాగృతం అన్నారు. ఇది ఏ వేగంతో శుద్ధ చైతన్యంగా మారుతున్నదో అదే వేగంతో మూఢంగా,  అంధకార మయమై, సూక్ష్మ నాళంగా  ఉన్న మూలాధారంలో ఇమడలేక ఊర్ధ్వ దిశకు ప్రయాణం చేస్తున్నది. ఆ ప్రయాణంలో శరీరం పైన ఉన్న భాగాలలో చైతన్యం పెరిగి వాటికి చుట్టూ ఉన్న ప్రకృతికి సంబంధాన్ని వెదుకుతూ ఉంటుంది.  బాల్యంలో ఉన్న అవస్థకు క్రమేణ ప్రకృతి జ్ఞానం రావడానికి కారణం ఇదే. ఈ ప్రయాణంలో ఆ చైతన్య శక్తి చేసే నిరంతర ప్రక్రియ తాను ఉన్న శరీరానికి, వాటి అవయవాలకు మధ్య, బయట ప్రపంచానికి, ప్రకృతికి మధ్య నిరంతర సంయమన సంతులిత సంకల్ప సమతుల్య క్రియ మాత్రమే. ఇది ఎందుకు చేస్తున్నదంటే అది శరీరంలో ప్రశాంత ఆనంద స్థిర (సచ్చిదానంద) స్థాయిలో ఉండడానికి అది చేసే ప్రయత్నం. ఈ రకంగా ఊర్ధ్వ ముఖంగా ప్రయాణిస్తున్న చైతన్య శక్తి ఆయా నాడీ చక్రాలను దాటుతూ తన పై శరీర ప్రభావాన్ని తగ్గించుకొంటూ స్వతంత్రంగా సంకల్పంతో సంతులిత స్థిర చైతన్యంగా మారుతూ చివరకు శుద్ధ స్థిర సంకల్ప సంతులిత జ్ఞాన చైతన్య శక్తిగా అంటే లలిత గా శరీరంలో బ్రహ్మ రంధ్రం నుండి  ప్రవెశించి జ్ఞానాన్ని, శ్రీ అనే సంతులిత తత్వాన్ని కలుపుకొని శ్రీ లలితగా తిరిగి తాను ప్రవెశించిన బ్రహ్మ రంధ్రం చేరడానికి ప్రయత్నం చేస్తున్నది. అక్కడ నుండి ఇంతకు ముందు లలితగా తనకు లేని జ్ఞాన, సమన్వయ, సంతులిత, స్థిరత్వాన్ని తీసుకుని తిరిగి తన మూలమైన విశ్వశక్తిలో మనుగడ సాగించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదే జీవునికి జనన మరణ రహితమైన మొక్షము. ఇది చేరనంతవరకు శరీరం జీవితంలోనూ,  ఆ తరువాత కాంక్షా జ్ఞానంతో మరణం లో బయటకు వచ్చిన జీవ చైతన్యం అనుభవించే స్థాయిలే స్వర్గ నరకాలు.  

స్థిరం గా   తన  ఆ శక్తిని సంతులితం చేస్తూ  సహస్రాంరంలో శ్రీ పురానికి అన్ని ఆవరణలు ఎందుకంటె ఆ కుండలిగా ఉన్న శక్తిని జాగృతం చేయడానికి అనేక భౌతిక,  మానసిక, విజ్ఞాన ఆవరణలను దాటి ప్రయాణించవలసి వుంది. ఇక సుధా సముద్రమంటే సహస్రారం శక్తి స్థిరత్వం కలిగిన యోగి నిత్యం శరీరం అంతా స్రవిస్తున్న అమృత ధారలను ఆస్వాదిస్తూ దివ్యత్వాన్ని పొందుతాడు. అక్కడే దేవతలు ఆమెను దర్శిస్తున్నారు అంటే ఆ స్థాయి అమృత పానం చేసిన వారంతా అమరులు లేక దేవతలే. ఇక అక్కడ కూడా అమృత పానంతో తృప్తి చెందకుండా మోక్ష సాధన చేసే వారు దేవతలనే శాసించే ఋషులు లేక వారి గురువులు. ఆ స్థానానికి పోవడానికి సాధన చేస్తూ ఆజ్ఞను దాటి యోగ సమాధిలో ఉన్న వారు సిద్ధ పురుషులు. ఈ జ్ఞానం అవపోసన పట్టి బోధన చేసినవారు వివిధ స్థాయిలలో ఉన్న అనుభవ బోధ మానవ గురువులు. 

లలితా దేవి జీవ క్రియల కొరకై బాల గా మూలాధారం చేరిన తరువాత కుండలినిగా సుషుప్తిలో ఉంటుంది. తన చైతన్యం తో అర్హులైన సాధకులలో నిత్యం సంకల్ప సంతులన పరిణామాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యమైనది మొదటిది జీవికి తాను మనుగడ సాగించాలన్న తాపత్రయాన్ని వృద్ధి చేస్తుంది. ఆ పరిణామ మనుగడ లో మొదటి అడ్డంకుగా ఉన్న పశు,  అసుర (కామ,  క్రోధ, మదం) ప్రవృత్తులను నిర్మూలించడం లేక శుమ్భ నిశయంబులను, భండాసురాది అసుర సంహారం చేయటం. లలితలో ఈ ప్రేరణకు కారణం సుషుమ్న ఊర్ధ్వ ముఖంలో విశుద్ది ఆది ఆజ్ఞా పర్యంతం ఉన్న దివ్య లేక దైవీయ శక్తులు (మోహ, లోభ, మాత్సర్యం,). ఈ అసుర దివ్య శక్తుల మధ్య పరిణామ దశలో అనేక స్థాయిలలో అనేక అరిషడ్వార్గాల కలయిక నిష్పత్తులలో మానవులు ఉన్నారు. జీవులన్నీ సహజ పరిణామ ప్రయాణంలో ఉన్నాయి. అందుకే ఏ కొద్ది యోగులకు సిద్ది లభించినా కోట్ల జీవరాసులతో పాటు మనిషి తన నిరంతర ప్రయాణం చేస్తున్నాడు. మూలాధారంలో ఉన్న ప్రాణం ఉన్న కొద్ది శక్తిని చేరి కామం లేక కోరిక తో మొదలై అది జన్మ సిద్ధి వలన కాని లేక పరిసర ప్రభావం వలన కాని త్వరగా ఊర్ధ్వ దిశకు సుషుమ్నలో ప్రయాణం సాగిస్తుంది. అది స్వాధిష్టాన అగ్ని శక్తిని కలుపుకొంటూ పరిసరాల వివేకం పెంచుకొని అనాహతం చేరుతుంది. అనాహతం లో సౌర శక్తిని తీసుకొని కామ, క్రోధ, మదాలు కొద్దిగా నియంత్రించబడి మొహం,  లోభం, మాత్సర్యం గా మారతాయి. తన సమ ఉజ్జీని కామంతో నూ, అవసరంతోనూ మూలాధారంలో గుర్తించిన చైతన్యం అనాహతంలో స్నేహానికి, ప్రేమగా మారుతుంది. ఇది క్రమేణా ఒకరికొకరు జీవితకాలం సొంతం కావాలనే తీవ్ర తాపత్రయం తో స్త్రీ పురుషుల మధ్య అత్యంత బలమైన కామ, మోహ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ పరిణామంలో మదం మందగించినా క్రోధం అలాగే ఉంటుంది. కొన్ని అనుభవాల వలన అది కొన్ని సార్లు అంతః గర్భితమౌతుంది. ఈ దశలో లోభ మాత్సర్యాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. కనుక ప్రేమ అంటే కామం మొహం గా మారడం. ఈ మోహ బంధం లేక  స్త్రీ పురుషుల మధ్య మాత్రమే కాక స్వలింగ ఆకర్షణ గా ఉండి ఇద్దరిలో సహజీవన ఉద్దేశ్యంతో స్నేహంగా మారుతుంది. ఈ స్నేహం ఒకరి నుంచి ఒకరు అవసరాలు పంచుకొనే స్వార్థ సహితమైనది కావచ్చు లేక ఎటువంటి స్వార్థం లేకుండా ఒకరి మధ్య ఒకరికి జీవన బంధం కావచ్చు. కనుక కామమైనా, మొహమైనా వాటి నుండి వచ్చిన ఆకర్షణ, ప్రేమ,  స్నేహం అయినా ఆ శక్తిలో ప్రాణ భాగం తగ్గి జ్ఞాన లేక బుద్ధి భావం పెరిగేదాన్ని బట్టి ఉంటుంది. ఈ బుద్ధి బాహ్య ప్రపంచ తత్వ,  శాస్త్ర శోధనలో ప్రాణాన్ని కర్మేంద్రియాలకు కలిపితే మనస్సుగా శరీర మాయకు లోనవుతూనే ఉంటుంది. ఈ స్థాయిలో ఆ వ్యక్తి అత్యంత ధనవంతుడైనా, సమాజంలో శక్తివంతుడైనా లేక ప్రపంచ శాస్త్ర జ్ఞానం కలిగిన మేధావి అయినా తామస గుణం తక్కువ రాజస గుణం ఎక్కువ కలిగిన మానవుడు గానే ఉంటారు. ఇది ప్రకృతికి అవసరమైన భౌతిక, సమాజానికి అవసరమైన మానసిక ప్రవృత్తి మాత్రమే. అలా కాకుండా తన జ్ఞానాన్ని అంతః శోధనకు ప్రయోగించి  శరీరం లో పంచీకరణతో మూల తత్వమైన ఆ పరా శక్తిని తెలుసుకొని సాధనతో ఆ శక్తి గా మమేకం కావాలనే తీవ్ర సంకల్పం పెంచుకొంటాడు. ఇదే ఆయా దేవతా రూపాలపై పెరిగే ప్రీతి లేక భక్తి. ఈ పర ( పరాశక్తి జ్ఞానం ), సహజ సాధన నుండి సంకల్ప సాధనగా మారి ప్రాణం శూన్యమై, జ్ఞానం అంతర్లీనమై స్థితి చైతన్య శక్తుల మధ్య  సంతులన లక్ష్యం  తో ముందుకు సాగుతాడు. లక్ష్య సిద్ధి జరిగిన తరువాత మూల పరాశక్తి లలితా రూపం శ్రీ ని ( సంతులన సంకల్పాన్ని కలుపుకొని ) శ్రీ లలితగా స్థిర  స్థితి చైతన్య సమతుల్య స్థాయితో తన చైతన్య భాగాన్ని తన సంకల్పాధీనంలో ఉంచుకొని అది దాని బుద్ధి లేక జ్ఞానం ( జ్ఞానేంద్రియ సహితమై ) ప్రసరించిన మేరకు ( శరీరం నుండి విశ్వం వరకు ) ప్రాణమై కర్మేంద్రియాలపై,  శరీరం, సంఘం, ప్రకృతి పై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు జరిగే సంఘటనలే మహత్యాలుగా, మానవాతీత కార్యాలుగా పేర్కొంటున్నారు. ఈ మహాత్యాలను చేయగల మానవాతీత శక్తులను భౌతికంగా ఆవిష్కరించగల శక్తులను దేవతలు అనీ, ఆ శక్తులను ఊహించి మనస్సు పై ప్రభావం చూపించే భౌతిక రూపం లేని అస్తిత్వాలను ఆత్మలనీ  అంటున్నారు. దృశ్య అదృశ్య ప్రపంచంలో ఉన్న ఈరెండు శక్తుల ప్రభావం పరిణామ జ్ఞానమై ఈ ప్రకృతిని ఆవరించి ఆయా స్థాయి వ్యక్తులపై ప్రభావాన్ని చూపుతూ ఊర్ధ్వ లేక అధో దిశకు నడిపిస్తున్నాయి.  

కావాలని అవి పశు అసుర ఇచ్చా భావ క్రియల అధీనంలో ఉన్నాయి అని తెలుసుకోవడం, దేవతలుగా ఉన్న  బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ద్వారా ఆ శక్తిని ప్రార్థించడం. ఆ తరువాత ఆ దివ్య శక్తులన్నీ కలిసి అసుర సంహారానికి దేవికి సహాయకులుగా నిలవడం. ఇదంతా సాధకుని అరిషడ్వర్గ అధీనంలో ఉన్న ప్రాణాన్ని,  చైతన్యాన్ని ప్రేరేపించి నిర్జీవ పదార్థ ప్రభావంతో ఉన్న ప్రథమ జీవ శక్తికి చలనం కలిగించడం. ఇంద్రియాధీనత నుండి క్రమేణా జ్ఞానం వైపు నడపడం. జ్ఞానం నుండి ధర్మ కర్మలతో సంకల్పంతో సంతులిత స్థిరత్వం వైపు నడపడం. శరీర  పదార్థంలో బంధించబడి ఉన్న ఆ చైతన్య శక్తి క్రమేణా తాను ఆ పదార్థాన్ని భేదించి తన మూల తత్వం చేరుకొనే ప్రయత్నం. సంతులిత లలిత తన అసమతుల్యత ప్రభావం నుండి బయటపడడానికి మొదట తన చైతన్యాన్ని తగ్గించుకొని మందగించిన భ్రమణంతో స్థిర పదార్థ రూపం తీసుకొంటుంది. ఆ తరువాత ఆ పదార్థ బంధం నుండి విడివడి స్వేచ్ఛ కొరకు ఆ ప్రథమ పదార్థాన్ని విస్ఫోటనం చేసి అనేక భాగాలై వ్యాపిస్తుంది. ఇప్పుడు ఆ భాగాల సంయోగ సమ్మేళనంలో తన చైతన్య శక్తిని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ఆ సంయోగ వియోగ సమ్మేళనాల చైతన్య జాగృతి పరిణామ రూపాంతరంలో జీవ ప్రాథమిక పదార్థమైన నత్రజని సంయోగ పదార్థాలు, ఎమినో ఆమ్లాలు ఏర్పడుతున్నాయి. వాటి నుండి నిత్యచైతన్య పరిణామ  రూపాంతరంలో భాగంగా ఆర్ యెన్ ఏ వంటి ప్రాథమిక జీవ పదార్ధం అణువు నుండి జీవ కణంగా మారుతుంది. ఇదే శాస్త్రం చెప్తున్న జీవ నిర్జీవ పదార్థాల సంధిలో పుట్టిన వైరస్ కణం. దీన్నుండి మరింత చైతన్య జీవ పదార్థ పరిణామ రూపాంతరం లో డి ఎన్ ఏ వంటి అత్యంత సంక్లిష్ట సంయోగ జీవ పదార్థ ఆవిష్కారం చేసుకొన్నది. ఇక్కడ నుండి తన పదార్థ సమ్మేళనం పై తన స్వతంత్ర ఇచ్ఛా శక్తిని పదార్ధం పై జ్ఞానాధిపత్యాన్ని, మరింత పరిణామ రూపాంతరానికి కావలసిన సంతులిత ( స్థిర చైతన్య నిష్పత్తుల మధ్య ) సంకల్ప క్రియా శక్తిని వృద్ధి చేసుకొంటూ ఏక కణ జీవి నుండి మానవ పరిణామం వరకు ప్రయాణించింది. మానవ శరీరంలో మూల జీవ క్రియలకు ఆధారమైన  మూలాధారంలో తన అనంత శక్తిని తగ్గించుకొని పదార్థ బంధంలో ( మాయలో జీవుని బంధించి ) చైతన్య శక్తి సుషుప్త కుండలినిగా ఉండి మానవుని పశు అసుర ప్రవృత్తి స్థాయిలో మనుగడకు ఉపయోగ పడుతున్నది. ఇక్కడ నుండి తమ మూల శక్తి అయిన బాలను గూర్చి తెలుసుకొని ఆరాధించిన వారిలో మొదట పరిణామ ఇచ్ఛను, తరువాత దానికి వలసిన జ్ఞాన సంపాదన,  సంతులిత సంకల్ప క్రియా తత్వాన్ని ఆ బాల త్రిపుర సుందరి రూపంలో ఆవిష్కరించడానికి తన ప్రయాణం మొదలు పెడ్తుంది. అక్కడ నుండి ఇచ్ఛా రూపమైన మహాకాళి గా,  జ్ఞాన రూపమైన సరస్వతిగా,  సంతులిత సంకల్ప రూపంగా మహాలక్ష్మిగా మూడు శక్తుల ఏకీకృత శక్తి మహా త్రిపుర సుందరిగా సహస్రారంలో శ్రీ లలితగా ఆవిష్కరించుకొంటున్నది. ఈ పరిణామ ప్రయాణం అంతా శక్తి ఇచ్చా జ్ఞాన క్రియలతో జరుగుతున్నది. పదార్థ రూపమైన శివుడు సాక్షిగా ఆమెను ధరిస్తూ, జ్ఞాన రూపమైన బ్రహ్మగా ఆమెకు స్పృహ ను కలిగిస్తూ, క్రియా రూపమైన విష్ణువుగా ఆ పరిణామానికి నిర్దిష్ట దిశను కలిగిస్తూ ఉన్నారు. వీరంతా ఆ పదార్థ పరిణామ దశలే కాని ఆ చైతన్యం కాదు. ఆ చైతన్యం తన మనుగడ కోసం ఈ పదార్థాన్ని తన సంతులన స్థితి కొరకు తానే రూపాంతరం చెంది స్థిర చైతన్యంగా మారడానికి ఉపయోగిస్తున్నది.  చైతన్య శక్తి అణు రూపంలో ఉన్న పదార్ధం నుండి  కణ రూపంలో ఉన్న జీవ పదార్థంగా మారిన తరువాత కర్మ బంధం మొదలవుతున్నది. ఆ కర్మ బంధం కూడా ఆమె పరిణామ భాగమే. జీవులలో చైతన్యం, జ్ఞానం, సంతులన కర్మ లేక క్రియ సహజంగా పెరిగే కొద్దీ లేక తమ శక్తి అస్తిత్వ చైతన్యవంతులైన శక్తి సాధకులలో వేగంగా పరిణామ వృద్ధి జరిగి ఆయా స్థాయిలను చేరుతున్నది. ఈ ప్రయాణంలో మూలాధారంలో ఉన్న జీవుడు అరిషడ్వర్గ అధీనంలో శరీరమే మాయగా ఉంటాడు. అనాహతంలో ప్రేమ ( లైంగికార్షణ మూలమైన వైవాహిక జీవితం, జ్ఞాన సహిత జీవనమైన స్నేహం ), ఆప్యాయత ( తమను కన్న తల్లిదండ్రులపై,  తాము కన్న సంతానంపై అభిమానం ) మొదలైన బంధాలను పెంచుకొని మొహమనే మాయ లో  చిక్కుకొని తపిస్తూ ఉంటాడు. అవి దాటి చైతన్యం ఆజ్ఞను చేరగానే జ్ఞాన తృష్ణతో తన చుట్టూ ఉన్న సంఘాన్ని,  ప్రకృతిని, విశ్వాన్ని విశ్లేషిస్తాడు. చివరకు బాహ్య శోధన ముగించి అంతర్ముఖుడై తన స్వీయ నిజ రూప దర్శనం కోసం ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో తన శరీర పదార్థానికి మూలమైన శక్తి కొరకు అన్వేషణ సాగించి దానిలో మమేకం కావడానికి ప్రయత్నిస్తాడు. అంటే పదార్ధం సమతుల్యతలో ఆ చైతన్య శక్తితో స్థిర శాశ్వత మనుగడ సాగించడానికి జ్ఞానంతో సంకల్పంతో ప్రయత్నించడం. ఇదే మూలాధారంలో బ్రహ్మ, అనాహతంలో విష్ణువు, ఆజ్ఞలో రుద్రుని తత్వ దర్శనం. చివరకు ఆ పదార్ధం తాను ఆ చైతన్య రూపాంతరం వలన ఏర్పడి సాక్షిగా ఉన్న కేవల సదాశివుడినేనని అర్థం చేసుకుని శ్రీ లలితా రూపంతో శాశ్వత సత్య రూపంగా కలిసి మనుగడ సాగిస్తాడు. ఈ పదార్థ చైతన్య ద్వయమే స్త్రీ పురుషులుగా వారి మధ్య లైంగిక ఆకర్షణ సమ ఉజ్జీల ( శివ శక్తుల ) మధ్య  ప్రేమగా మారుతున్నది. లేదా జీవ సంతులనమే ఆధారంగా (లక్ష్మీ నారాయణ ద్వయంగా ), జ్ఞాన నాద సమతుల్యతలో సరస్వతి చతుర్ముఖుడుగా స్త్రీ పురుషులు వైవాహిక జీవితం సాగిస్తున్నారు. వివాహం ముందు సమ ఉజ్జీ కొరకు అన్వేషణ సాగించి ప్రేమ బంధంలో చిక్కుకొంటున్నారు. ఈ ప్రేమ సమ ఉజ్జీల సమరస ప్రయాణంతో తమ నిజ తత్వాలను చేరడమే లక్యంగా ఉంటుంది .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.